బీజేపీకి షాక్ ఇస్తూ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై అనూహ్యంగా కాక్రోచ్ లకు మద్దతు పలికారు. ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఇతర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న సీజేపీ సభ్యులపై ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశ్నించారు.
తాను స్థాపించిన ‘వుయ్ ద లీడర్స్’ ఉద్యమం తరఫున అన్నామలై ఈ అంశంపై స్పందించారు. సీజేపీ సభ్యులపై ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ, పోలీసులు తమ చర్యల ద్వారా ప్రజాస్వామ్యానికి నష్టం కలిగిస్తున్నారని అన్నారు.
ఢిల్లీ పోలీసులు నిజంగా అపకారం చేస్తున్నారు. వారి నిరసనల తీరు లేదా పద్ధతులతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ వారు లేవనెత్తాలనుకుంటున్న ప్రశ్నలకు మాత్రం పూర్తిగా మద్దతు ఇస్తాను. వారిని అరెస్టు చేసి జైలుకు లాగడం వల్ల వారి నాయకులు మరింత బలపడతారు” అని అన్నామలై పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై సందేహాలు వ్యక్తం చేయడం సహజమైన హక్కులని ఆయన అభిప్రాయపడ్డారు. విమర్శలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆ ప్రశ్నలను పక్కనపెట్టి అరెస్టులకు ప్రాధాన్యం ఇవ్వడం సరైన విధానం కాదని అన్నారు. కఠినమైన పోలీసు చర్యలు రాజకీయంగా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.
సీజేపీ లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ, “నాకు కొంత ఆందోళనగా ఉంది. ఢిల్లీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారేమోనని అనిపిస్తోంది. న్యాయమూర్తి కూడా విచారణ నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది” అని అన్నామలై వ్యాఖ్యానించారు. అయితే, న్యాయమూర్తి విచారణ నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై ఆయన మరిన్ని వివరాలు వెల్లడించలేదు.
మరో ప్రశ్నకు సమాధానంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఎస్‌ఐఆర్‌పై ప్రశ్నలు లేవనెత్తే హక్కు ఉందని అన్నామలై అన్నారు. అయితే, ప్రశ్నించే క్రమంలో ప్రజాస్వామ్య సంస్థలకు నష్టం కలిగించే పరిస్థితులు ఏర్పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
