ఆధ్యాత్మికంహోమ్

పాండురంగడి సేవలో తరించిన భక్త జనాబాయి

భక్తికి, ఆ దేవదేవుడి సాన్నిధ్యం పొందడానికి కులం, జాతి, మతం, పేద, గొప్ప, స్త్రీ, పురుష భేదాలు లేవని నిరూపించే సంఘటనలు, భక్తుల కోసం ఆ భగవంతుడు తానే కదిలి వచ్చిన కథనాలు చరిత్రలో ఎన్నో విన్నాం.

భక్తి అంటే కర్తవ్యాన్ని మరిచి చరించడం కాదు, కర్తవ్య నిర్వహణతోనే భక్తిమార్గం ముడిపడి ఉందని నిరూపించింది పాండురంగ విఠలుడి పరమ భక్తురాలైన జనాబాయి. విఠలుడు ఆమె గుడిసెకు వచ్చి ‘జనా! ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టవా’ అని అడిగి మరీ ఆమెతో కలిసి భుజించాడన్నది ఐతిహ్యం.

జనాబాయి 13వ శతాబ్దానికి చెందిన భక్తురాలు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లా గంగాఖేడ్‌లో దళిత కుటుంబంలో జన్మించింది. తల్లి చిన్నతనంలోనే మరణించింది. ఏడేళ్ల వయసులో తండ్రితో కలిసి పండరీపూర్‌ వచ్చింది జనాబాయి.

కొద్దికాలానికే తండ్రినీ కోల్పోయింది. అనాథగా మారిన ఆమెను ప్రఖ్యాత భక్త కవి నామ్‌దేవ్‌ కుటుంబం అక్కున చేర్చుకుంది. నామ్‌దేవ్‌నే ఆధ్యాత్మిక గురువుగా భావించి, విఠలుణ్ని హృదయంలో నిలుపుకొంది జనాబాయి. సరళమైన మరాఠీ భాషలో ఆమె 300కి పైగా భక్తి గీతాలు రచించినట్లు తెలుస్తోంది.

‘ఘర స్వచ్ఛ కరీన్‌ మి, నామ్‌ తుజే గాయిన్‌ మి’ అన్న అభంగంలో జనాబాయి నిజమైన భక్తి సాధన అంటే ఏంటో, అదెలా చెయ్యాలో చెప్పింది. మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చని చాటింది.

పాండురంగడికి భోజనం పెట్టాలని తపించి, తన స్థితికి బాధపడుతూ దూరంగా ఉండిపోయిన జనాబాయి దగ్గరికి ఆ పరమాత్మ తానే స్వయంగా వచ్చాడని చెబుతారు. జనాబాయి చేతి భోజనం తిని, ఆమెతో ముచ్చట్లాడాడట విఠలుడు.

తెలతెలవారుతుండగా తన మెడలోని నగలను అక్కడే వదిలి వెళ్లిపోయాడట. దాంతో జనాబాయే దొంగతనం చేసి ఉంటుందని భావించి ఆమెను శిక్షించడానికి స్తంభానికి కట్టేశారు. అది చూసి విఠలుడు సహించలేకపోవడంతో అందరూ చూస్తుండగానే స్తంభం కరిగి నీరుగా మారిపోయిందన్నది మరో ఐతిహ్యం.

అదొక్కటే కాదు, జనాబాయి చేతిలోని తిరగలి తీసుకుని తాను పిండి విసురుతూ, ఆమెతో అభంగాలు పాడించుకుని మురిసిపోయేవాడట విఠలుడు. జనాబాయి ఇంటిపనులు చేస్తున్నా విఠల నామస్మరణ ఆగేది కాదు.

ఇలా చెప్పుకొంటూ పొతే విఠలుడి పట్ల ఆమెకున్న భక్తి ప్రపత్తుల్ని, వాత్సల్యాన్నీ వెల్లడించే గాథలు ఎన్నో. వందల సంవత్సరాల తరవాత కూడా ఆమె అభంగాలు, సంత్‌ జనాబాయిగా ఆమె పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయాయి.

జనాబాయి అభంగాలు కేవలం ఆధ్యాత్మిక కవితలు కాదు; లింగ, కుల వివక్షల పట్ల తీవ్ర విమర్శలు, స్త్రీల హక్కుల కోసం పిలుపులు ఉంటాయి వాటిలో. స్త్రీలకూ వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలు, తమదైన అస్తిత్వం ఉంటాయని భావించేది జనాబాయి.

అందుకే తన అభంగ్‌లలో చాలావరకు విఠలుణ్ని ‘రుక్మిణి భర్త’గా ప్రస్తావించింది. తన భక్తి గేయాల ద్వారా సమానత్వాన్ని ప్రబోధించింది.

Related posts

అబద్ధాల పునాదులపై ఎంత కాలం ఇలా…?

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

సెక్రటేరియేట్ ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం

Satyam News

హైదరాబాద్ లో దోమల బెడద పై తక్షణ చర్యలు

Satyam News

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లా

Satyam News

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్ధులు

Satyam News

Leave a Comment