గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారని ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు విమర్శించారు. నరసరావుపేటలోని మాంస విక్రయ కేంద్రాలపై ఆదివారం ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అస్తవ్యస్తమైన పాలన సాగించిన తరుణంలో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థలన్నింటిని పునరుద్ధరించి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదివారం రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రత కలిగించే విధంగా విధి విధానాలు రూపొందించడం జరిగింది.
ముఖ్యంగా ప్రజలు పౌష్టిక ఆహారం మరియు ప్రోటీన్ ల కోసం కరోనా తర్వాత సామాన్యుడు ఎక్కువగా మాంసాహార ఉత్పత్తులపై ఆధారపడడం జరిగింది. ఆ మాంసాహార ఉత్పత్తులను సైతం కల్తీ చేసి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి చికెన్ సెంటర్ లకు వ్యాధి బారిన పడిన కోళ్లను తరలిస్తూ కొన్ని కంపెనీలు దళారులు ప్రజా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారాలు చేస్తున్నాయి.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ మాంసాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చికెన్ మరియు మటన్ అలాగే ఇతర మాంస ఉత్పత్తుల విక్రయాలపై, వాటి నాణ్యత పై తరచూ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఆ ప్రాంతాల్లో విక్రయిస్తున్న మాంస ఉత్పత్తులను, అలాగే వాటి నాణ్యతను పరిశీలించి ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యాల పైన మాంస ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు నిర్లక్ష్యం చేశారు.
వారి పైన కఠిన నిర్ణయాలు తీసుకుంటూ సంబంధిత అధికారుల ద్వారా వారి లైసెన్స్ రద్దుచేసి, అపరిశుభ్ర వాతావరణంలో విక్రయిస్తున్న మాంసాన్ని అలాగే ఫ్రిడ్జ్లలో నిల్వ చేసినటువంటి మాంసాన్ని స్వాధీనపరచుకొని ల్యాబ్ లకు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా నరసరావుపేట పట్టణంలో గల హోటల్లో నిలువ ఉంచిన మాంసం, అలాగే చికెన్ మటన్ సెంటర్లను తనిఖీ చేశారు.
నరసరావుపేటలోని వినుకొండ రోడ్డు, రాయపాటి రోడ్డు, పాత మార్కెట్, చిలకలూరిపేట రోడ్డు గడియారం సర్కిల్ లో గల హోటల్స్ లో మరియు మాంస విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఎక్కడైతే అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచినా, చనిపోయిన కోళ్లను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఇలాంటి అపరిశుభ్రమైన మాంసాన్ని తినడం ద్వారా ప్రజా ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశించిన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు విఘాతం కలుగుతుందని తెలిపారు. అందువల్ల వ్యాపారస్తులు అందరూ తప్పకుండా నాణ్యమైన మాంసం ప్రజలకు అందించాలని, లేనిపక్షంలో ఎవరైతే కల్తీ వ్యాపారానికి కొమ్ముకాస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాంస అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చంద్ర దండు ప్రకాష్ నాయుడు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి బి. శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ రవి కుమార్, ఆహార భద్రతా అధికారి పి. శ్రీకాంత్ చౌదరి, పశువైద్యుడు డాక్టర్ కె.వి. శ్రీకాంత్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాంస అభివృద్ధి కార్పొరేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
