కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో నమోదైన డయేరియా కేసుల పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆగస్టు 19 నుంచి 23 వరకు 5, 7, 9వ వార్డుల్లో మొత్తం 19 మంది తీవ్ర విరేచనాల లక్షణాలతో బాధపడినట్లు గుర్తించారు. వీరిలో 15 మందిని ఉయ్యూరు సీహెచ్‌సీలో చేర్చారు. ఆరుగురు చికిత్స అనంతరం ఇళ్లకు వెళ్లారు. 9 మంది ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన నలుగురికి ఓపీ, ఇంటి వద్దే చికిత్స అందించారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన
ఉయ్యూరులో డయేరియా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆదివారo రాష్ట్ర వైద్య బృందo ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేసిoది. పర్యటించిన బృందంలో డాక్టర్ కె. అర్జునరావు, జాయింట్ డైరెక్టర్, సీడీపీ, రాష్ట్ర సర్వైలెన్స్ యూనిట్, డాక్టర్ పి.ఎల్. దయాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కృష్ణా జిల్లా, డాక్టర్ ఏ.వి. శేషుకుమార్, డీసీహెచ్‌ఎస్, కృష్ణా జిల్లా ఉన్నారు.
వీరితో పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడకు చెందిన పీడియాట్రిక్స్, మైక్రోబయాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాల నిపుణులతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. బృందంలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పీడియాట్రిక్స్ డా.. అశ్విని, ఇతర వైద్యులు బృందంలో ఉన్నారు. ప్రాథమిక నివేదికను వైద్య బృందం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ కు పంపించింది. మొత్తం 19 కేసులు నమోదయాయని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని మరణాలు సంభవించలేదని నివేదికలో పేర్కొంది. దీనిని పరిశీలించిన రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ చక్రధర్ బాబు పరిస్థితులు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చేంత వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతూనే ఉండాలని సదరు అధికారులకు స్పష్టం చేశారు
5, 7, 9వ వార్డుల్లోనే కేసులు
ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని 5, 7, 9వ వార్డుల్లోనే కేసులు కేంద్రీకృతమయ్యాయి. ఆగస్టు 19న 5వ వార్డులోని శ్రీలంక కాలనీలో తొలి కేసు గుర్తించారు. అనంతరం 5, 7, 9వ వార్డుల్లో వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 23 నాటికి మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. ఆగస్టు 20 నుంచి ప్రభావిత వార్డుల్లో రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 19 నుంచే 10 బృందాలతో ఇంటింటా యాక్టివ్ ర్యాపిడ్ హౌస్‌హోల్డ్ సర్వైలెన్స్ కొనసాగుతోంది.
తాగునీటిపై ప్రత్యేక దృష్టి
ప్రభావిత వార్డుల్లో తాగునీటికి వాసన, రుచి మారినట్లు ఫిర్యాదులు రావడంతో నీటి వనరులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7వ వార్డు నుంచి 25 నీటి నమూనాలు, 5, 9వ వార్డుల నుంచి మరో నాలుగు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.
బాధితుల నుంచి సేకరించిన మల నమూనాలను కూడా ప్రయోగశాలకు పంపించారు. నీటి నమూనాలను బ్యాక్టీరియాలజీ పరీక్షలకు, మల నమూనాలను కల్చర్, సెన్సిటివిటీ, మైక్రోస్కోపీ పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగశాల పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే డయేరియాకు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించనున్నారు.
క్షేత్రస్థాయి విచారణలో ప్రభావిత ప్రాంతాల్లోని పలువురు బాధితులు వ్యాధి లక్షణాలు కనిపించే ముందు స్థానికంగా బయట నుంచి ఆహారం తీసుకున్నట్లు గుర్తించారు. అదే సమయంలో ప్రభావిత వార్డుల్లోని అనేక కుటుంబాలు తాగునీటి నాణ్యత మారినట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో కమ్యూనిటీ తాగునీటి వనరు కలుషితం కావడం ప్రధాన కారణమై ఉండొచ్చని, బయట ఆహారం తీసుకోవడం కూడా వ్యాధి వ్యాప్తికి దోహదపడి ఉండవచ్చని వైద్య బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. ల్యాబ్ ఫలితాల అనంతరం తుది కారణం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా
ఉయ్యూరు మున్సిపాలిటీతో సమన్వయం చేసుకుని ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి వనరులకు క్లోరినేషన్ చేపట్టారు. ప్రజల అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. ప్రభావిత వార్డుల్లో ORS, జింక్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. ఉయ్యూరు సీహెచ్‌సీలో అవసరమైన ఐవీ ద్రవాలు, ORS, అత్యవసర మందులను అందుబాటులో ఉంచారు.
ఇంటింటా సర్వే.. అవగాహన
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు ఆదేశాల అనుసరించి సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో ఇంటింటా సర్వే కొనసాగుతోంది. అనుమానిత కేసులను గుర్తించి అవసరమైన వారికి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నారు. సేవల్లో లోపo రాకుండా చూడాలని వైద్యులకు కమిషనర్ చక్రధర్ బాబు స్పష్టం చేశారు.
నిరంతరం పర్యవేక్షణ
క్షేత్రస్థాయి పరిశీలనలో కేసులు పరిమిత ప్రాంతంలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 5, 7, 9వ వార్డుల్లో కేసులు కేంద్రీకృతమైనప్పటికీ పక్క గ్రామాలకు వ్యాప్తి చెందినట్లు ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.
చాలా మంది బాధితులు 40–60 ఏళ్ల వయసు వారని, వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాప్తి జరిగినట్లు ఆధారాలు లేవని వైద్య బృందం గుర్తించింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ యూనిట్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
