ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణ రంగ అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తిని తయారు చేయడంలో “అధునాతన నిర్మాణ కార్యకలాపాలు మరియు నిర్మాణ సాంకేతికతలపై జాతీయ వర్క్‌షాప్” కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.
యువ నాయకుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించడం సంతోషకరమని మంత్రి తెలిపారు. అమరావతి నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు మరియు గృహ నిర్మాణ కార్యక్రమాల నేపథ్యంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం మరింత పెరిగిందన్నారు.
గత ఐదేళ్ల పాలనలో పరిశ్రమలను ప్రోత్సహించకుండా మూసివేసే విధానాలు అమలయ్యాయని విమర్శించారు. సరైన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు లేక యువత మరియు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డుకు వచ్చిన రూ.2574 కోట్ల cess నిధుల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి మరియు మంత్రి కృషితో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వంటి అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది నారా లోకేష్ దూరదృష్టికి నిదర్శనమన్నారు.
కార్మికులు కేవలం హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలంటే నైపుణ్యాభివృద్ధి అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంపై కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు అమలు చేస్తోందన్నారు. NAC సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, భద్రతా ప్రమాణాలు, ప్రాక్టికల్ శిక్షణపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.
“స్కిల్ ఇండియా మిషన్” లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కార్మిక శాఖ సేవలను డిజిటలైజేషన్ దిశగా తీసుకెళ్తూ, కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల అమలు, ఆన్‌లైన్ సేవలు, డేటా మేనేజ్‌మెంట్‌లో సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు.
భవన నిర్మాణ కార్మికులకు ప్రసూతి సహాయం రూ.20,000, వివాహ కానుక రూ.20,000, సహజ మరణ సహాయం రూ.60,000, అంత్యక్రియల సహాయం రూ.20,000 అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ పథకాల ద్వారా కార్మిక కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.
15 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్
అసంఘటిత రంగ కార్మికుల కోసం “ఇంటిగ్రేటెడ్ లేబర్ అమెనిటీస్ కాంప్లెక్స్ (ILAC)” కేంద్రాలను రాష్ట్రంలోని 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా కార్మికులు ఒకేచోట చేరి ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు కాంట్రాక్టర్లు మరియు కార్మికుల మధ్య సమన్వయం పెరుగుతుందని తెలిపారు. మహిళా కార్మికుల భద్రత, ఆరోగ్యం, గౌరవం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
లేబర్ అడ్డాల ద్వారా ఈ-శ్రమ్, BOCW సేవలు, సంక్షేమ పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై సమాచారం అందిస్తున్నామని చెప్పారు. వర్క్‌షాప్ సందర్భంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న పరిశ్రమ భాగస్వాములు మరియు సంస్థలను మంత్రి అభినందించారు.
ఆధునిక, పారదర్శక, ప్రజాకేంద్రిత పరిపాలనకు నారా లోకేష్ చూపుతున్న దూరదృష్టి అభినందనీయమని మంత్రి కొనియాడారు. “కార్మికుల శక్తి దేశాభివృద్ధికి మూలస్తంభం… ఆ శక్తికి నైపుణ్యం జోడిస్తేనే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి” అనే దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఈ జాతీయ వర్క్‌షాప్ విజయవంతం కావాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్, భవన నిర్మాణ ఇతర నిర్మాణ సంక్షేమ మండలి చైర్మన్ వలవల బాబ్జి లేబర్,ఫ్యాక్టరీస్, బాయిలర్స్ కార్యదర్శి ఎం వి శేషగిరి బాబు కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, స్కిల్ డెవలప్మెంట్ ఎండి గణేష్ అధికారులు పాల్గొన్నారు.
