మెదక్హోమ్

కృష్ణా జలాల విషయం పట్టించుకోని సీఎం

#HarishRao

మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తీసుకుపోతుంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు.

పూర్తి ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని, ఇండ్లెంట్లు, బోర్డు అనుమతులు లేకుండానే ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తరలించుకుపోతుందని అన్నారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు రాసిన లేఖను ప్రస్తావిస్తూ, దాని ప్రకారం ఈ వాటర్ ఇయర్‌లో 664 టీఎంసీలు అంటే సుమారు 80 శాతం నీటిని ఏపీ వినియోగించుకుందని తెలిపారు.

తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఏపీ వాటా 66 శాతం మాత్రమేనని, అయినా జనవరి 28 నాటికే ఆ పరిమితిని దాటిందని, ఇంకా రెండు రోజుల్లో వాటా పూర్తిగా మించిపోతుందని కేఆర్ఎంబీకి తెలంగాణ ఇఎన్సీ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి ఏపీ నీటి దోపిడిని ఆపాలని ఆ లేఖలో కోరినట్లు చెప్పారు.

ఇఎన్సీ రిటైర్ అయినా పోస్టు భర్తీ చేయలేదు

జనవరి 28న లేఖ రాసిన ఇఎన్సీ జనవరి 31న రిటైర్ అయ్యారని, ఆయన రిటైర్ అయిన తర్వాత వారం రోజుల పాటు ఆ పోస్టును ఖాళీగా ఉంచారని హరీశ్ రావు ఆరోపించారు. లెక్కకు మించిన నీళ్లు ఏపీ తీసుకుపోతున్న సమయంలో కీలకమైన ఇఎన్సీ పోస్టును నింపకపోవడం రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. మీడియా ప్రశ్నించిన తర్వాతే వారం రోజులకు ఆ పోస్టును భర్తీ చేశారని విమర్శించారు.

ఈ వాటర్ ఇయర్‌లో జనవరి 29, 2026 నాటికి ఏపీ 664 టీఎంసీలు వినియోగించుకుందని, తాత్కాలిక ఒప్పందం ప్రకారం 66 శాతమే వాడాల్సి ఉండగా 80 శాతం వాడిందని చెప్పారు. రేవంత్ రెడ్డి, నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా కేవలం ఉత్తరాలు రాయడం తప్ప చర్యలు లేవని విమర్శించారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలిపోతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుని వ్యవహరిస్తోందని ఆరోపించారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు పంటలు, పారిశ్రామిక అవసరాలకు నీరు అవసరమని, రాష్ట్ర అవసరాలను పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. తాత్కాలికంగా అయినా తెలంగాణ తన 34 శాతం వాటాను వినియోగించుకోవాల్సి ఉండగా కేవలం 20 శాతమే వాడుకుందని చెప్పారు.

నీటి వినియోగ హక్కును కూడా వదులుకుంటున్నారు

తెలంగాణకు 174 టీఎంసీల వినియోగ హక్కు ఉన్నా ప్రభుత్వం వినియోగించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈరోజుకూ ఏపీ రోజుకు సుమారు 1.5 టీఎంసీల నీటిని తీసుకుపోతుందని, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ హయాంలో కృష్ణా జలాల వినియోగం ఎప్పటికీ లేనంత తక్కువగా ఉందని, వరుసగా రెండేళ్లుగా అత్యల్ప వినియోగంతో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఏడాది కూడా 20 శాతం దాటలేదని, ఇది ముఖ్యమంత్రి వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటినే కాలరాస్తున్నారని, పాలనపై పట్టు లేదని తీవ్ర విమర్శలు చేశారు. తాము లేవనెత్తిన అంశాల తర్వాతే కేఆర్ఎంబీకి లేఖ రాసి ఏపీ నీటి వినియోగం నిజమేనని ప్రభుత్వం ఒప్పుకుందని అన్నారు. నామమాత్రంగా లేఖలు రాయడం తప్ప ప్రభుత్వ చర్యలు లేవని విమర్శించారు.

బీజేపీ చేతుల్లో చిక్కుకు పోయిన కేఆర్ఎంబీ

ఇఎన్సీ లేఖలో ఏపీ 664 టీఎంసీలు తీసుకుపోయిందని ఉంటే, కేఆర్ఎంబీ లేఖలో మాత్రం 555 టీఎంసీలే వినియోగించిందని చెప్పడం ద్వారా వంద టీఎంసీలు తగ్గించి చూపారని ఆరోపించారు. అడగాల్సిన ముఖ్యమంత్రి అడగడంలేదని, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ ఏపీని ప్రశ్నించడంలేదని అన్నారు. కేఆర్ఎంబీ బీజేపీ ప్రభుత్వ చేతుల్లో ఉందని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు చేయడం తప్ప తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయంపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు లేవనెత్తడం లేదని, కేఆర్ఎంబీని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, అడ్డగోలుగా ఏపీకి నీళ్లు తరలిస్తూ తెలంగాణ రైతుల నోళ్ల కొడుతున్నాయని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతున్నారా అని ప్రశ్నించారు.

ఏపీకి నీళ్ల తరలింపు అడ్డుకోవాలి

చంద్రబాబు, రేవంత్ మధ్య ఏ బంధం ఉన్నా రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు రాసివ్వడం ఎందుకని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే స్పందించి ఏపీకి నీళ్ల తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. క్యారీ ఫార్వర్డ్ విధానంలో శ్రీశైలంలో పై నీటిని ఆపి ఉంచాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

త్వరలో కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, కేంద్ర మంత్రిని కలుస్తామని, పార్లమెంట్‌లో ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 16 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణ హక్కులను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 19 చోట్ల బీఆర్ఎస్ టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తే మిగతా 9 చోట్ల ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని హరీశ్ రావు అన్నారు.

Related posts

సంప్ర‌దాయం ఆధునిక‌త‌ల మేళ‌వింపుగా బతుకమ్మ వేడుక‌లు

Satyam News

గద్వాల జిల్లా కోర్టు సముదాయం పీజేపీ క్యాంపు లోనే నిర్మించాలి

Satyam News

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

Satyam News

రిటైర్డ్ అధికారులకే పెద్ద పీట: మారని ఆనవాయితీ!

Satyam News

‘కందుకూరు హత్య’ ను కుల కోణంలో చూపిస్తూ వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News

ప్రాణాలు కాపాడిన 2టౌన్ పోలీసులు

Satyam News

Leave a Comment