జాగృతి జనం బాట కార్యక్రమం సందర్భంగా వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై బహిష్కృత బీఆర్ ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవహారం జిల్లాలో పార్టీని దెబ్బతీస్తోందని, ఆయన అరాచకాలు తారాస్థాయికి చేరాయని ఆమె ఆరోపించారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, నిరంజన్ రెడ్డి వ్యవహారంపైనా, మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. నిరంజన్ రెడ్డి బీసీ యువకులపై అన్యాయంగా కేసులు పెట్టించి, వారిని కొట్టించారని తెలిపారు. మూడు సార్లు 32 మంది బీసీలపై కేసులు పెట్టడం అన్యాయమని, రైతులకు నీళ్లు పెట్టే విషయంలో కూడా ఆయన పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
“జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకోవటం సరికాదు” అని విమర్శించారు. కృష్ణా నది కాల్వ భూములను కబ్జా చేసి ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న విషయం ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, హరీష్ రావు మనిషి కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవటం లేదని కవిత వ్యాఖ్యానించారు. “నాపై ఇష్టానుసారంగా మాట్లాడితే పుచ్చ లేస్తుంది… తండ్రి వయసు ఉన్నా గౌరవిస్తా కానీ ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు” అని ఆమె హెచ్చరించింది.
చేనేత సమస్యలు, ప్రాజెక్టులు..ప్రజా సమస్యలపై కవిత డిమాండ్లు
కొత్త కోట మండలంలో చేనేత కార్మికుల సమస్యలు తీవ్రమైనప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరికి కూడా సాయం చేయలేదని కవిత మండిపడ్డారు. చేనేత కార్మికుల పెండింగ్ బకాయిలైన రూ.10 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హామీ వెంటనే అమలు చేయాలని కోరారు.
కనాయిపల్లి శంకర సముద్రం ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె ఆరోపించారు. 20 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలు పూర్తికాలేదని, గేట్లు ఎత్తడం వల్ల గ్రామాలు నీట మునిగిపోతున్నాయని తెలిపారు. గతంలో ఇచ్చిన భూములను కూడా కొంతమంది రాజకీయ నేతలు కబ్జా చేస్తున్నారనే ఫిర్యాదులను ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేశారు.
హాస్పిటల్ సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం
వనపర్తి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌లో డాక్టర్లు, స్టాఫ్ కొరత తీవ్రంగా ఉందని, రేడియాలజీ వంటి విభాగాల్లో శాశ్వత సిబ్బంది లేరని చెప్పారు. డయాగ్నోస్టిక్ సెంటర్ మెషిన్లను ఎలుకలు పాడు చేశాయని, ప్రజలు పరీక్షల కోసం మహబూబ్ నగర్ వెళ్లాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శానిటేషన్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు, రోడ్లు, డబుల్ బెడ్‌రూమ్స్.. సమస్యల వరస..
వనపర్తిలో 1000 కొనుగోలు కేంద్రాలు అవసరమైన చోట కేవలం 330 మాత్రమే ఏర్పాటు చేశారని, దీని వల్ల ధాన్యం కొనుగోలు తీవ్రంగా ఆలస్యమైందని కవిత ఆరోపించారు. రైతులకు బోనస్ ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పాతపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికావడం లేదని, కొందరు 80 వేల రూపాయలు లంచం అడుగుతున్నారని ఆమె ఆరోపించారు. పెబ్బేరు రోడ్లు దయనీయస్థితిలో ఉన్నాయని, రోడ్డు వెండింగ్ కారణంగా భూములు పోయిన వారికి సరైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
స్త్రీలకు ఇచ్చే వాగ్దానాలు ‘మోసం’
మహిళలకు బస్సులు కొనిస్తే కోటీశ్వరులు అవుతారని సీఎం చెప్పడంపై కవిత వ్యంగ్యంగా స్పందించారు. “50 వేల, లక్ష రూపాయల లోన్లతో మహిళలు కోటిశ్వరులు ఎలా అవుతారు? ఇది మోసం మాత్రమే” అని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. మహిళలకు కనీసం నాలుగు లక్షల గ్రాంట్, రెండు లక్షల లోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలను ఇందిరమ్మ, సోనియమ్మ పేరుతో పంచుతున్నారని, ఎన్నికల కోడ్ రాకముందే చీరలు పంచమని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా ప్రతి మహిళకు చీరలు ఇవ్వాలని స్పష్టంగా చెప్పారు.
వనపర్తి అభివృద్ధి ఇంకా దూరంలోనే…
వనపర్తిలోని పాలిటెక్నిక్ కాలేజీకి విడుదలైన రూ.23 కోట్లు రద్దు చేయడం అన్యాయమని, విద్యార్థులకు హాస్టల్ లేక పాములతో జీవించాల్సి వస్తుందని కవిత పేర్కొన్నారు. ఫిబ్రవరి 13లోపు కాలేజీని పూర్తిగా అభివృద్ధి చేయాలని, లేదంటే జాగృతి తరఫుననే కాలేజీని బాగు చేస్తామని హెచ్చరించారు.
సీఎం పై నేరుగా ప్రశ్నలు
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ప్రభుత్వం వైఖరి పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “మహబూబ్ నగర్ జిల్లాపై నిజంగా ప్రేమ ఉంటే, అక్కడి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయాలి” అని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వనపర్తిలో అరాచకాలు, కబ్జాలు, అవినీతి చేస్తున్నవారిని ఏ పార్టీ అయినా ప్రోత్సహించకూడదని, ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ జిల్లాలో బతికి బట్టకట్టదని కవిత వ్యాఖ్యానించారు.
“ప్రజలు ఇంకా ఎక్కువ మెజార్టీతో ఓడిస్తారు” అని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని చరిత్ర, సంస్కృతి, పోరాట గాధలను గుర్తుచేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని కవిత హామీ ఇచ్చారు.
