వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు మారడం లేదా..?? 11 స్థానాలతో బుద్ధిచెప్పినా ఆయన వ్యవహార శైలి మారడం లేదా..?? ప్రతిపక్ష హోదా లేకుండా తిరస్కరించినా ఆయనలో మార్పు రాలేదా…?? ఈ ప్రశ్నలు సగటు వైసీపీ అభిమాని నుండి వ్యక్తం అవుతున్నాయి. జగన్ అంటే దేవుడు.. ఆయన రోడ్డు మీదకి వచ్చారంటే ప్రజలు సాగిలపడాలి.. అన్నా.. మాకు సాయం చెయ్.. నువ్వు లేకపోతే దిక్కులేదు.. నువ్వే మమ్మల్ని కాపాడే దైవం అంటూ ఆయన ముందు మోకాళ్లతో వేడుకోవాలి.. ఎన్నికల ముందు ఈ విజువల్స్ చూసిన జనాలు ఆయనని అసహ్యించుకున్నారు.
జగన్ రోడ్ల మీదకు వస్తున్నారంటే కొంతమంది పేటీఎమ్ ఆర్టిస్టులని తీసుకువచ్చి చిద్విలాసంగా కాన్వాయ్ వెహికిల్‌లో పయనిస్తుంటే, ఎర్రటి ఎండలో మిట్ట మధ్యాహ్నం మహిళల్ని నడిరోడ్డుపై నిలబెట్టి వారితో దండాలు పెట్టించిన విజువల్స్ చూసి జగన్‌పై ఏహ్యభావం కలిగింది కొందరికి.. సాయం కోసం వచ్చిన వారిని, ఆపదల్లో ఉన్న వారితో ఇలాంటి డ్రామా స్కిట్‌లు, స్క్రిప్టులు చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే జుగుప్స కలిగింది చాలా మందిలో.. ఇదే జగన్ పతనాన్ని శాసించాయని చెబుతారు.
అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలి రోడ్డు మీదకు వచ్చిన సందర్భాలు తక్కువ.. ప్రజా సమస్యలు తెలుసుకున్న సందర్భాలు కూడా తక్కువ.. ప్రజా దర్బార్ పెడతానని, వారి సమస్యలు విన్నవించుకోవచ్చని, వాటికి క్షణాలలో పరిష్కారం తీసుకువస్తానని హామీ ఇచ్చారు జగన్.. అయిదేళ్లలో ఒక్క ప్రజాదర్బార్ పెట్టలేదు.. కానీ, ఎన్నికల ముందు కొందరు పేటీఎమ్ ఆర్టిస్టులతో, మహిళలతో చేయించిన విన్యాసాలకి ఆయనలోని ఫ్యూడల్ మెంటాలిటీ బయటకి వచ్చిందనే కామెంట్స్ వినిపించాయి..
జగన్.. అధికారంలో ఉంటే పేదలకు న్యాయం జరుగుతందని చెప్పాలని ఐ ప్యాక్ టీమ్ లక్ష్యం అయితే, అది ఛీ కొట్టేలా చేసిందనే వ్యాఖ్యలు వినిపించాయి.. అధికారం దూరమయినా జగన్‌ని నేటికీ దైవాంశ సంభూతుడిగా ఓ 10 ఏళ్ల చిన్నారితో విజయవాడలో చేయించిన విన్యాసం ప్రజలకు చీదర పుట్టేలా చేసిందనే కామెంట్స్ వస్తున్నాయి.. ఇది జగన్ మామని ప్రజలకు దగ్గర చేయడం కాదు, ఆయనని ఫ్యూడల్ లీడర్‌గా, ఫ్యాక్షనిస్ట్ పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా మార్చిందనేది ఐ ప్యాక్ టీమ్‌తోపాటు ఆయన సలహాదారులకు అర్ధం కావడం లేదా..? అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
10 ఏళ్ల చిన్నారి అమ్మ ఒడిమీద ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదా..? ఆమె అంతటి అనర్గళంగా సంభాషించగలదా.? ఎందుకు ఈ డ్రామా.?? జగన్‌ని మెప్పించడానికా..? జనాల్ని మోసగించడానికా..?? అసలు ఐ ప్యాక్ టార్గెట్ ఏంటి?? ఏం చెప్పాలనుకుంటున్నారు..?? అనే ప్రశ్నలు వేస్తున్నారు వైసీపీ నేతలు.. మరి, దీనిపై జగన్ ఇప్పటికయినా సమీక్ష చేసుకొని తీరు మార్చుకోవడం మంచిది.. లేదంటే, ప్రజలకు దగ్గర కావడం కాదు, ఆయన దూరం కావడం గ్యారంటీ.