భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాలపై మరొక్క అనుమానాల నీడ పరచుకుంది. భారత్ లాంటి అతి పెద్ద మార్కెట్ లోకి తమ వ్యవసాయ ఉత్పత్తులను పంపుతున్నామని వాషింగ్టన్ ప్రకటించడం కొత్త అనుమానాలకు తావిస్తున్నది. అమెరికా వ్యవసాయ శాఖ మంత్రి బ్రూక్ రోలిన్స్, “కొత్త భారత్–అమెరికా ఒప్పందం” ద్వారా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారత్‌కు మరింత పెరుగుతాయని ప్రకటించారు.
ఇది అమెరికా రైతులకు, గ్రామీణ సమాజాలకు గొప్ప విజయమని ఆమె పేర్కొన్నారు. “ఈ కొత్త ఒప్పందం భారతదేశం వంటి విశాల మార్కెట్‌కు మరిన్ని అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి దోహదపడుతుంది. దీని వల్ల ధరలు పెరిగి, గ్రామీణ అమెరికాలో నగదు ప్రవాహం పెరుగుతుంది,” అని రోలిన్స్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
అమెరికా రైతులకు మళ్లీ మేలు చేశారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 2024లో భారత్‌తో అమెరికాకు వ్యవసాయ రంగంలో సుమారు 1.3 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని రోలిన్స్ గుర్తు చేశారు. భారత్‌లో పెరుగుతున్న జనాభా అమెరికన్ ఉత్పత్తిదారులకు పెద్ద అవకాశమని, ఈ ఒప్పందం ఆ లోటును తగ్గించడంలో సహాయపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
ఇది “అమెరికా ఫస్ట్” విధానంలో భాగమని, ఇటీవలి కాలంలో కుదిరిన అనేక వ్యవసాయ వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు తగ్గించేందుకు, నాన్-టారిఫ్ అడ్డంకులను సడలించేందుకు లేదా మార్కెట్ యాక్సెస్‌ను విస్తరించేందుకు అంగీకరించిందా లేదా అన్న విషయాలపై భారత అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఇంత కాలం ఉన్న రక్షణ ఇక పోయినట్లేనా?
దేశీయ రైతులు, ఆహార భద్రతను కాపాడేందుకు భారత్ సంప్రదాయంగా ఈ రంగాన్ని కట్టుదిట్టంగా రక్షిస్తూ వస్తోంది. అమెరికా వ్యవసాయ మంత్రి ప్రకటన రావడానికి ఒక రోజు ముందే, భారత్ అమెరికా మధ్య విస్తృత వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత వస్తువులపై అమెరికా విధించిన పరస్పర టారిఫ్‌లు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.
ఈ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం తీసుకున్నదని ట్రంప్ వెల్లడించారు. టారిఫ్ తగ్గింపును ప్రధాని మోడీ స్వాగతిస్తూ, ఇది ద్వైపాక్షిక సంబంధాలకు అనుకూలమైన అడుగని పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఇప్పుడు 18 శాతం మాత్రమే టారిఫ్ ఉండడం ఆనందంగా ఉంది. భారతదేశంలోని 140 కోట్ల ప్రజల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు,” అని మోదీ ఎక్స్ (X) వేదికగా తెలిపారు.
“ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు లాభం చేకూరుతుంది. పరస్పర ప్రయోజనకరమైన సహకారానికి అపార అవకాశాలు తెరుచుకుంటాయి,” అని మోడీ పేర్కొంటూ, భారత్–అమెరికా భాగస్వామ్యాన్ని “అభూతపూర్వ స్థాయికి” తీసుకెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ట్రంప్ మరింత ముందుకెళ్లి, అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు, నాన్-టారిఫ్ అడ్డంకులను సున్నాకు తగ్గించేందుకు అంగీకరించిందని, అలాగే అమెరికా నుంచి ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు వంటి వాటిని భారీగా 500 బిలియన్ డాలర్లకు మించి కొనుగోలు చేస్తుందని చెప్పారు.
రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసి, అమెరికా లేదా వెనిజులా నుంచి ఇంధనం దిగుమతి చేసుకుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. అయితే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని స్వాగతిస్తూ, ఇది రెండు దేశాల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను బలోపేతం చేస్తుందని తెలిపారు.
“మన ఆర్థిక సహకారంలో అవకాశాలు అపారంగా ఉన్నాయి. వాటిని పూర్తిగా వినియోగించుకుంటామని మేము నమ్ముతున్నాం. బలమైన ఆర్థిక సంబంధాలే అత్యంత శక్తివంతమైనవిగా ఉంటాయి,” అని జైశంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. భారత్‌లో వ్యవసాయం కోట్లాది చిన్న రైతుల జీవనాధారమైనందున, వాణిజ్య చర్చల్లో ఇది ఇప్పటికీ రెడ్ లైన్ అంశం గానే ఉంది.
గతంలో ప్రపంచ స్థాయి లేదా ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలన్న ప్రయత్నాలు దేశీయంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. వాషింగ్టన్ ఈ ఒప్పందాన్ని కీలక ముందడుగుగా చూపిస్తున్నప్పటికీ, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఒప్పందపు తుది రూపం ఏమిటన్నది ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
