రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతులను సన్నద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పి. నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రైతులతో విస్తృతంగా సమావేశమయ్యారు.
నాలుగు రెవెన్యూ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులు హాజరై ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. సమావేశానికి ముందు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ ఎండ్రాయి గ్రామానికి చెందిన రైతు ధర్మారావు నివాసానికి వెళ్లి ఆయనతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత ల్యాండ్ పూలింగ్‌లో ఉన్న నాలుగు గ్రామాల రైతులతో జరిగిన సమావేశంలో భూముల సమర్పణ, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, రైతుల భూములకు లభించనున్న ప్రయోజనాలపై సమగ్ర చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నంబూరి బలరాం అనే రైతు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌కు ముందుగానే తన నాలుగు ఎకరాల భూమికి సంబంధించిన అసలు పత్రాలను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ సమక్షంలో ఆర్డీవోకు స్వచ్ఛందంగా అందించారు. రైతుల ఎలాంటి సమస్యలైనా నేరుగా తన వద్దకు వచ్చేలా మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ అనివార్యమైందని, రైతులు సహకరిస్తే అన్ని లాభాలు తిరిగి రైతులకే చేరుతాయని మంత్రి, ఎమ్మెల్యే ప్రవీణ్ తెలిపారు. రాజధాని చుట్టుపక్కల భూముల విలువ పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీలు, విమానాశ్రయం వంటి కీలక సౌకర్యాలు రావాల్సిన అవసరం ఉందని, వాటి ద్వారా భారీ స్థాయిలో ఉద్యోగాలు సృష్టించబడటంతో ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రి పేర్కొన్నారు.
స్పోర్ట్స్ సిటీ పై ప్రత్యేక దృష్టి
అమరావతిలో నిర్మించనున్న స్పోర్ట్స్ సిటీపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, 2,500 ఎకరాలలో ఒలింపిక్ స్థాయి సదుపాయాలతో ఒక ఏడాదిలో నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్టుగా మంత్రి నారాయణ వివరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు కేటాయించే రిటర్న్ ప్లాట్లలో ముందుగా రహదారులు, అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని తెలిపారు.
ల్యాండ్ అక్విజిషన్ మోడల్‌లో రైతులకు నష్టం జరగవచ్చనే అభిప్రాయంతోనే ప్రభుత్వం మళ్లీ గత మాదిరిగా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయాలను సేకరించి, రైతుల అభీష్టం మేరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రైతులకు క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని వెల్లడించారు.
గత ప్రభుత్వ నిర్వాకం, వరుణుడి ప్రభావం వల్ల రాజధాని పనులు కొంత ఆలస్యం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తిరిగి కార్యాచరణను పటిష్టంగా ప్రారంభించిన ప్రభుత్వానికి రైతులు అందిస్తున్న సహకారాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ ప్రత్యేకంగా అభినందించారు.
