అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన ముగ్గురు సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. 50 శాతం సుంకం విధింపు అమెరికా కార్మికులు, వినియోగదారులు మరియు భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వారు విమర్శించారు.
భారత్ నుంచి దిగుమతులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం వరకు సుంకాలు విధించేందుకు జాతీయ అత్యవసర పరిస్థితి క్లాజును వాడుకున్నారు. దాంతో దీన్ని రద్దు చేయాలనే లక్ష్యంతో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అత్యవసర ప్రకటన ఆధారంగా భారత్ పై సుంకం విధించడాన్ని వారు “చట్టవిరుద్ధం”గా పేర్కొన్నారు.
డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి అనే ఈ ప్రతినిధులు ముందుండి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం, బ్రెజిల్‌పై విధించిన ఇలాంటి సుంకాలను రద్దు చేయాలని, దిగుమతి సుంకాలను పెంచేందుకు అధ్యక్షుడు అత్యవసర అధికారాలను వినియోగించడాన్ని నియంత్రించాలని కోరుతూ సెనేట్‌లో వచ్చిన ద్విపాక్షిక చర్యకు కొనసాగింపుగా వచ్చింది.
2025 ఆగస్టు 27న భారత్‌పై విధించిన అదనపు 25 శాతం “సెకండరీ” సుంకాలను రద్దు చేయాలని లక్ష్యంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌తో వాణిజ్యం, పెట్టుబడులు, చురుకైన భారతీయ-అమెరికన్ సమాజం ద్వారా నార్త్ కరోలైనా ఆర్థిక వ్యవస్థ బలంగా అనుసంధానమై ఉందని కాంగ్రెస్ వుమన్ డెబోరా రాస్ తెలిపారు.
భారత కంపెనీలు ఆ రాష్ట్రంలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టి, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించాయని, అదే సమయంలో నార్త్ కరోలైనా తయారీ సంస్థలు ఏటా వందల మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
భారత్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి అని, ఈ చట్టవిరుద్ధ సుంకాలు ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న ఉత్తర టెక్సాస్ ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని కాంగ్రెస్‌మన్ మార్క్ వీసీ అన్నారు.
ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్‌మన్ రాజా కృష్ణమూర్తి కూడా ఈ సుంకాలు ప్రతికూలమైనవని, సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయని, అమెరికా కార్మికులకు నష్టం కలిగించి వినియోగదారుల ఖర్చులను పెంచుతాయని వ్యాఖ్యానించారు. ఈ సుంకాలను ముగించడం ద్వారా అమెరికా–భారత్ ఆర్థిక మరియు భద్రతా సహకారం మరింత బలపడుతుందని ఆయన చెప్పారు.
అమెరికా ప్రయోజనాలు లేదా భద్రతను ముందుకు తీసుకెళ్లకుండా, ఈ సుంకాలు సరఫరా వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి, కార్మికులను నష్టపరిచి, వినియోగదారులపై భారాన్ని పెంచుతున్నాయని కృష్ణమూర్తి తెలిపారు. ఇవి ముగిస్తే భారత్‌తో కలిసి ఉమ్మడి ఆర్థిక, భద్రతా అవసరాలను ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికాకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.
భారత్ తో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించుకోవాలి
ట్రంప్ తీసుకున్న ఏకపక్ష వాణిజ్య నిర్ణయాలను సవాలు చేయడం, భారత్‌తో అమెరికా సంబంధాలను పునఃస్థాపించడం అనే విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఈ తీర్మానం వచ్చిందని డెమోక్రాట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లో రాస్, వీసీ, కృష్ణమూర్తి, రో ఖన్నా సహా మరో 19 మంది కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌ను తన సుంక విధానాలను వెనక్కి తీసుకుని, భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దాలని కోరిన సంగతి కూడా ఉంది.
ట్రంప్ విధించిన భారత సుంకాలను ముగించడం ద్వారా వాణిజ్యంపై కాంగ్రెస్‌కు ఉన్న రాజ్యాంగబద్ధ అధికారాలను తిరిగి సాధించడమే కాకుండా, అధ్యక్షుడు అత్యవసర అధికారాలను ఉపయోగించి తన తప్పుదారి పట్టిన వాణిజ్య విధానాలను ఏకపక్షంగా అమలు చేయడాన్ని అడ్డుకోవడమే ఈ ప్రయత్నం ఉద్దేశమని ప్రకటనలో పేర్కొన్నారు.
ఆగస్టులో ట్రంప్ భారత్ నుంచి దిగుమతులపై ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకం విధించగా, కొన్ని రోజుల తర్వాత మరో 25 శాతం పెంచి మొత్తం 50 శాతానికి తీసుకెళ్లారు. రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించడం ద్వారా ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ ప్రయత్నాలకు భారత్ తోడ్పడుతోందని ఆరోపిస్తూ ఆయన ఈ చర్యలు తీసుకున్నారు.
