హైదరాబాద్ నగరంలోని బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న అనంతరం, హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో లేదా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్న షామీర్‌పేటలోని బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. నిన్న మాదాపూర్‌లోని చందు నాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని, ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని ఏకంగా 90 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు.
విజన్ పేరుతో డబ్బా కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి
“రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు… విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారింది. పిల్లల పాలిట రేవంత్ రెడ్డి పాయిజన్‌గా మారాడు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని, ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులు తిరిగి హాస్టల్‌కు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి ఉందని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందించేవారని, ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతూ అన్నం కూడా సరిగా ఉడకడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
“టీవీ యాడ్లు, పేపర్ యాడ్లకే తెలంగాణ రైసింగ్. వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్‌లో ఫాలింగ్. రైసింగ్ ఎక్కడంటే అవినీతిలో, అరాచకంలో, అహంకారంలో రైసింగ్” అని విమర్శించారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామంటున్న ప్రభుత్వం, అప్పటివరకు పిల్లలు బతికేది ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కనీసం చీమ కుట్టినట్టైనా స్పందించలేదని, ఏనాడూ ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించలేదని ఆరోపించారు.
ఫుట్ బాల్ ఆటలో బిజీగా ఉన్నావా సీఎం?
ఫుట్‌బాల్ ఆడడంలో సీఎం బిజీగా ఉంటాడని, మెస్సితో ఫుట్‌బాల్ ఆడేందుకు మేస్త్రీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, 5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నారని విమర్శించారు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్‌బాల్ ఆడడం ఎందుకని, ఆ డబ్బుతో విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టలేవా అని నిలదీశారు.
“నీ కబ్జాలకు, నీ కమిషన్లకు టైం ఉంది… కానీ విద్యార్థులను పట్టించుకోవడానికి టైం లేదు. 61 సార్లు ఢిల్లీకి వెళ్లడానికి టైం ఉంది కానీ ఆసుపత్రిలో ఉన్న పిల్లలను పరామర్శించడానికి టైం లేదా?” అని ప్రశ్నించారు. అలాగే, ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారి అన్న రాహుల్ గాంధీ ఎక్కడున్నాడని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల మరణాలు, విద్యార్థుల మరణాలు, 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీల పోరాటం వంటి ఎన్నో సమస్యలు ఉన్నా రాహుల్ గాంధీ ముఖం చాటేశాడని విమర్శించారు. ఫుట్‌బాల్ చూడడానికి మాత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నాడని ఎద్దేవా చేశారు.
“కలుషిత ఆహారం తిని కడుపునొప్పితో ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడు రాహుల్ గాంధీ. గురుకులాల్లో పురుగుల అన్నం తింటూ ఆగమవుతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే బాధ్యత లేదా?” అని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని హరీష్ రావు వ్యాఖ్యానించారు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెప్పడం కాదు, ముందుగా హాస్టల్ పిల్లలకు పురుగులేని అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు.
