తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి కేవలం టీ-ఫైబర్ (T-Fiber) ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీ-ఫైబర్ పురోగతిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్‌తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీ-ఫైబర్ సేవల విస్తరణ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్య సాధనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
అలాగే సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల కోసం ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం టీ-ఫైబర్ నెట్‌వర్క్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వ శాఖలకు సేవలు అందిస్తున్న ‘టీ-స్వాన్’ (T-SWAN) నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మార్పు ద్వారా ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా, వేగంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’కి కూడా ప్రారంభం నుంచే అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ఇంటింటికి ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు అధిక వేగంతో నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు చర్యలు ముమ్మరం చేయాలని కూడా మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు.
టీ-ఫైబర్ ద్వారా ప్రభుత్వ శాఖలకు ఏకీకృత ఇంటర్నెట్ సేవలు అందించడం వల్ల వ్యయ నియంత్రణతో పాటు మెరుగైన భద్రత, అధిక వేగం, సమర్థవంతమైన డిజిటల్ పాలన సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1ను లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి టీ-ఫైబర్ సేవలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
