వర్షాకాలం వరదలు.. వేసవి కాలం నీటి ఎద్దడి.. కాలుష్యం ఇప్పుడు భారతీయ నగరాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఇందుకు అతీతం కాదు. ఈ అవస్థల నుంచి నగరాన్ని బయటపడేయాలనే ఉద్దేశంతోనే హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను 2024 జులై 19న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు.
ఇది ఎంతో విప్లవాత్మకమైన, సాహోసోపేత నిర్ణయంగా పలు రంగాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగానే హైడ్రా పని చేస్తోంది. హైడ్రా ఏర్పాటై రెండేళ్ల కాలంలో 3325 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 1.50 లక్షల కోట్లు. సంస్థానాల విలీనం తర్వాత మరెప్పుడూ జరగని పని ఇది.
ఈ ఆక్రమణదారులు సామాన్యులు కాదు.. రాజకీయంగా, ఆర్థికంగా శక్తి సంపన్నులు. అయినా హైడ్రా వెరవలేదు. వెనకడుగు వేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిన అధికారాలు.. స్వేచ్ఛగా పని చేసే అవకాశం కల్పించడంతో ఇదంతా సాధ్యమైంది.
జలవనరుల పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి
“చెరువులు కేవలం జలాశయాలు కావు.. అవి నగరాల భద్రతకు, పర్యావరణ సమతుల్యతకు, భావితరాల భవిష్యత్తుకు జీవనాధారాలు.” సకల జీవకోటికి ప్రాణాధారమైనవి జలవనరులు. వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా, ప్రణాళిక లేని నిర్మాణాలు, భూకబ్జాలు, చెరువుల ఆక్రమణల కారణంగా నగరాల్లో జలవనరులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి గొలుసుకట్టు చెరువులు ప్రకృతి వరంగా నిలిచాయి. వర్షపు నీటిని ఒక చెరువు నుంచి మరో చెరువుకు మళ్లిస్తూ నగరానికి సహజ వరద నియంత్రణ వ్యవస్థగా అవి పనిచేశాయి. కానీ కాలక్రమేణా చెరువుల ఆక్రమణలు, కుంటలు, వాగులు, నాలాల కుదింపు కారణంగా అనేక జలవనరులు కనుమరుగయ్యాయి. ఓఆర్ ఆర్ పరిధిలో 1250 చెరువులుండేవి. సగానికి పైగా మాయం చేశారు.
వాటి స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా నగరం ‘కాంక్రీట్ జంగిల్’గా మారిపోయింది. చెరువులు, కుంటలు, వాగులు మాయం కావడంతో వర్షాకాలంలో నగరంలో వరదలు తరచూ సంభవిస్తున్నాయి. గంట కాలం వర్షానికే రహదారులు జలమయం అవుతున్నాయి. నివాస ప్రాంతాలు నీటమునిగిపోతున్నాయి.
ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా చేపడుతున్న చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు, నాలాలు, వాగులను ఆక్రమణల నుంచి కాపాడుతూ వాటి పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపడుతోంది. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటి సహజ ప్రవాహాన్ని పునఃస్థాపించి వరదల నియంత్రణకు కృషి చేస్తోంది.
ప్రజల జీవన ప్రమాణాలనూ పెంచే దిశగా..
చెరువుల అభివృద్ధిని కేవలం నీటి నిల్వకే పరిమితం చేయకుండా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో అనుసంధానం చేయడాన్ని హైడ్రా చేపట్టింది. చెరువుల చెంత పిల్లలకు క్రీడా మైదానాలు, అన్ని వయసుల వారికీ ఓపెన్ జిమ్లు, పార్కులు, పచ్చిక బయళ్లు, వాకింగ్ ట్రాక్లు అభివృద్ధి చేయడం ద్వారా వాటిని ప్రజలకు ఉపయోగపడే జీవన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. అదే సమయంలో చెరువుల పరిసరాల్లో పచ్చదనం గణనీయంగా పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది.
నగరాల్లో చెరువుల పరిరక్షణ అనేది కేవలం నీటి నిర్వహణ అంశం మాత్రమే కాదు; అది భవిష్యత్ తరాల జీవన భద్రతకు సంబంధించిన అంశం. చెరువులు అభివృద్ధి చెందితే వర్షాకాలంలో వరదల నియంత్రణ సాధ్యమవుతుంది. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. వేసవిలో నీటి కొరత తగ్గుతుంది. పచ్చదనం పెరుగుతుంది. వాయు కాలుష్యం తగ్గుతుంది. జలవనరులతో జీవ వైవిధ్యం నగరం సొంతం అవుద్ది. చెరువులను పరిరక్షించడం అంటే భవిష్యత్ను పరిరక్షించడమే. ప్రకృతిని కాపాడితేనే నగరం సురక్షితంగా, సుందరంగా, సుస్థిరంగా ఎదుగుతుంది.
వరదలు లేని నగరం ప్రభుత్వ స్వప్నం..
వందేళ్ళ క్రితం వరద నివారణకు నాటి నిజాం పాలకులు ఇంజినీరింగ్ దిగ్గజం మోక్షగుండం విశ్వేశ్వరయ్యను తీసుకువచ్చి.. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నిర్మించి నగరానికి వరద ముప్పు తప్పించారు. తర్వాత అంతటి స్థాయిలో ఈ అంశంపై ఎవరూ దృష్టి పెట్టలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా ఆలోచించి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా పని చేస్తోంది. నగరంలో చెరువుల పునరుద్ధరణనుపెద్దయెత్తున చేపట్టింది. ఇలా ఇప్పటికే 6 చెరువులను పునరుద్ధరించాం. రెండో విడతగా మరో 14 చెరువుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
వీటికి తోడు నగరం నలువైపులా మినీ ట్యాంక్బండ్లుండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 4 పెద్ద చెరువులను హైడ్రా చేపడుతోంది. వరద నీరు నేరుగా ఈ చెరువులకు చేరేలా హైడ్రా ఇన్లెట్లు అభివృద్ధి చేస్తోంది. చెరువు నిండిన తర్వాత ఆ నీరు కాలువలద్వరా దిగువున ఉన్న చెరువులకు చేరేలా ఔట్లెట్లను అభివృద్ధి చేస్తోంది.
కబ్జాల కోరల నుంచి విడిపించిన తర్వాత అంబర్పేటలోని బతుకమ్మకుంటను అభివృద్ధి చేసి వరదలను నియంత్రించాం. 5 సెంటీమీటర్ల వర్షం పడితే బతుకమ్మకుంట పరిసరాలను వరదలు ముంచెత్తేవి. సామాన్యుల జనజీవనం అస్తవ్యస్తమయ్యేది. ఇప్పుడు అక్కడ ఆహ్లాదకరమైన చెరువును తీర్చిదిద్దాం.
అలాగే కూకట్పల్లి నల్లచెరువు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. పాతబస్తీకి మణిహారంగా బమృకున్ – ఉద్ – దౌలా చెరువును హైడ్రా తీర్చిదిద్దింది. ఐటీ కారిడార్లోని శిల్పారామం పరిసరాలను వరద ముంచెత్తేది. తమ్మిడికుంట అభివృద్ధితో ఆ పరిసరాల్లో రెండేళ్లుగా వరద నీరు నిలవడంలేదు. ఇలా నగరంలో చెరువులన్నీ అభివృద్ధి చెందితే వరదలు నియంత్రణ పెద్ద కష్టం కాదు.
కబ్జాలను కట్టడి చేసిన హైడ్రా..
ఖాళీ జాగాలకు నగరంలో కొదవలేదు. వందలు వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములుండేవి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద సమకూరినవి, నిజాం పాలకుల నుంచి వచ్చినవి తోడయ్యాయి. ఇవే తర్వాత కాలంలో కబ్జాదారులకు కల్పతరవుగా మారాయి. అంగబలం, అర్థబలం ఉన్న వారు ఎకరాల కొద్దీ కబ్జా చేశారు. దొంగ పత్రాలతో సొంతం చేసుకున్నారు.
చెరువులను ఆక్రమించి లేక్ వ్యూ అని ఎక్కువ ధరకు కొంతమంది అమ్ముకున్నారు. ఇవన్నీ ప్రజల ఆస్తులు.. ప్రజలకే సొంతం కావాలి. హైడ్రా అదే పని చేస్తోంది. ఇప్పటికే ఇళ్లు కట్టుకుని నివాసం ఉన్న వాటి జోలికి వెళ్లకుండా హైడ్రా భారీ ఆపరేషన్లు నిర్వహించి 3325 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
ఇందులో ప్రభుత్వ భూమి 2665 ఎకరాలు కాగా..చెరువుల ఆక్రమణలు తొలగించి 454.11 ఎకరాలు, నాలాల ఆక్రమణలు తొలగించి 25.37, పార్కుల ఆక్రమణలు తొలగించి 90.39 ఎకరాలు, రహదారులు, ఫుట్పాత్లు ఆక్రమణలు తొలగించి 62.11 ఎకరాలు, నాలాలు ఆక్రమణలు తొలగించి 25.37 ఎకరాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన భూముల ఆక్రమణలు తొలగించి 26.38 ఎకరాలను హైడ్రా కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది.
ఈ భూములను అంకెల్లో లెక్కేస్తే 3325 ఎకరాలు… ప్రాణవాయువును అందించే పార్కులుగా, సకల జీవకోటికి ప్రాణాధారమైన జలవనరులుగా, భవిష్యత్ అవసరాలకు అవసరమయ్యే భూమిగా లెక్కలు వేస్తే వాటి విలువ అనంతమనే చెప్పాలి.
హైడ్రా సాధించిన విజయాలు..
జూబ్లీహిల్స్ నుంచి వచ్చే వరదతో కృష్ణానగర్ కొట్టుకుపోయేది. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద నడుం లోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. అమీర్పేట మెట్రో స్టేషన్ కింద ఉన్న వరద నీటి పైపులైన్లు పూర్తిగా పూడికతో మూసుకుపోవడంతో వరద సమస్య తలెత్తేది. దశాబ్దాలుగా ఇదే అవస్త ఉండేది. పైపులైన్లలో పూడికను తొలగించడం ద్వారా ఇప్పుడక్కడ వరద ముప్పు తప్పింది. కృష్ణానగర్ నుంచి శ్రీనివాస్ నగర్ మీదుగా అమీర్పేట వరకూ నాలాల పూడిక తీయడంతో వరద సాఫీగా సాగుతోంది.
బేగంపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే దారిలోని ప్యాట్నీ నాలా ఆక్రమణలు తొలగించి పైన ఉన్న 8 కాలనీలకు వరద ముప్పు తప్పించాం. 40 వేల కుటుంబాలు, 1.60 లక్షల మందికి వరద ఇబ్బందుల నుంచి గట్టెక్కించాం. ప్యాట్నీ నాలా 72 అడుగుల వెడల్పులో ఉండేది దానిని ప్యాట్నీ వద్దకు వచ్చే సరికి 10 అడుగులకు పరిమితం చేయగా.. హైడ్రా మొత్తం ఆక్రమణలను తొలగించి పూర్తి స్థాయిలో విస్తరించింది. దీంతో వరద ముప్పు తప్పింది.
బాగ్లింగంపల్లిలోని శ్రీరాం నగర్ పరిస్థితి.. వర్షం వస్తే వణికిపోయేవారు. పక్కనే హుస్సేన్సాగర్ వరద కాలువ ఉంది. ఆ కాలువకు వెళ్లే కాలువను ఆక్రమించి కబ్జాదారుడు మట్టిపోస్తే హైడ్రాకు ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగింది. కాలువను పునరుద్ధరించి వరద ముప్పు తప్పించింది.
మియాపూర్‌లో గుర్నాథ్ చెరువు, ఖాజాగూడలోని ఖాజాగూడ చెరువు, మల్కం చెరువుల ఇన్‌లెట్లలో భారీగా పూడికను తీసి ఆయా ప్రాంతాలకు వరద ముప్పు తప్పించింది హైడ్రా.
హైడ్రా కాపాడిన ప్రభుత్వ భూముల వివరాలు ఇలా..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో 816 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. సుప్రింకోర్టు న్యాయవాదినని చెబుతూ.. ప్రభుత్వ భూములు తెగనమ్మిన ముఖీంకు ముకు తాడు వేసి.. 40 ఎకరాల ఆక్రమణలను తొలగించింది. అక్కడ ఒక అంగుళం భూమి కూడా కబ్జా కాకుండా.. మున్ముందు కబ్జాలకు ఆస్కారం లేకుండా ఫెన్సింగ్ వేయడమైంది.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన భూమి ఆక్రమణలకు గురౌతుంటే.. హైడ్రా రంగంలోకి దిగి 300ల ఎకరాల భూమిని కాపాడింది. ఈ భూముల్లో అంతర్జాతీయ స్థాయి ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్ను 100 ఎకరాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయం, పాఠశాలలు, కళాశాలలు నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్లో 40 ఎకరాలను కాపాడింది. యూఎల్సీ భూములలో పాగా వేసిన వారిని ఖాళీ చేయించి ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందులోని 10 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్తో పాటు కళాశాలు, వసతి గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.
అనేక లే ఔట్లన్నీ కలిపి.. దివ్యానగర్ లే ఔట్గా మార్చి అక్కడ ప్లాట్లు అమ్మాలంటే.. నల్లమల్లారెడ్డికి అ ప్లాటు యజమాని కప్పం కట్టాలి. ఆ ప్లాట్లలోకి వెళ్లడానికి వీలు లేకుండా చేసిన వారికి గుణపాఠం చెప్పింది హైడ్రా.మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపాలిటీలో 200ల ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించి పరిసర కాలనీలకు దారులు మూసేసిన వైనంపై హైడ్రా చర్యలు తీసుకుంది. ప్రహరీలను తొలగించి కాలనీలకు దారి చూపింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మేడ్చల్ – మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాదారులు వాటాలేసుకుని కాజేయాలని ప్రయత్నించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో గల జీఎల్ ఆర్( జనరల్ ల్యాండ్ రిజిస్టర్) నంబరు 243, 255లలో ఉన్న 106 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి లోతుకుంట సర్వే నంబర్ 1, 2 తో ఎంటర్ అయి ఏకంగా లే ఔట్ వేసేశారు.
అక్కడ పర్యావరణానికి తూట్లు పొడుస్తూ సహజసిద్ధంగా ఉన్న కొండలను పేల్చుతూ వణ్యప్రాణుల మనుగడకు భంగం కలిగించారు. చిట్టి అడివిని తలపించే విధంగా ఉన్న పచ్చని గుట్టల్లో నెమళ్లు ప్రాణ భయంతో నివాస ప్రాంతాల్లోకి పారిపోయే విధంగా అక్కడ కొండలను పేల్చిన ఘటనలపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ప్రికాస్ట్ ఇటుకలతో ప్రహరీలు నిర్మించి ఆక్రమణల పర్వానికి తెరలేపగా.. వాటిని తొలగించి 106 ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. దీంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పెద్దయెత్తున హైడ్రాకు మద్ధతుగా ర్యాలీలు తీశారు. టపాసులు పేల్చి హైడ్రా జిందాబాద్ అంటూ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామంలోని 25, 26 సర్వే నంబర్లలో 650 ఎకరాలను హైడ్రా జులై 18వ తేదీన కాపాడింది. ఇదే జిల్లాలోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబరు 46లో ఉన్న 84 ఎకరాల ప్రబుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది.
హైడ్రా పునరుద్ధరించిన చెరువుల వివరాలు…
మొదటి విడత హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులు 6:
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట
కూకట్‌పల్లిలోని నల్ల చెరువు
పాతబస్తీలోని బమృకున్ – ఉద్ – దౌలా చెరువు
మాధాపూర్‌లోని తమ్మిడికుంట
మాధాపూర్‌లోని సున్నం చెరువు
ఉప్పల్‌లోని నల్ల చెరువు
రెండో విడత హైడ్రా చేపట్టిన 14 చెరువులు
ఖాజాగూడ – తౌతానికుంట (Thoutanikunta)
పుప్పాలగూడ – భాగీరథమ్మ చెరువు
మదీనగూడ – ఈర్ల చెరువు
బాచుపల్లి – ఎర్రకుంట చెరువు
రామంతాపూర్ – పెద్ద చెరువు
సాహెబ్‌నగర్ – కాప్రా చెరువు
నల్లగండ్ల – నల్లగండ్ల చెరువు
గంగారం – పెద్ద చెరువు
మూసాపేట్ – కాముని చెరువు
కూకట్‌పల్లి – రంగధాముని కుంట
ఇబ్రహీంబాగ్ – ఇబ్రహీం చెరువు
నాచారం – పెద్ద చెరువు
జూబ్లీహిల్స్ – కృష్ణకాంత్ ఎన్ పార్క్
నిజాంపేట్ – తుర్క చెరువు
నగరం నలుదిక్కుల మినీ ట్యాంక్‌బండ్‌లుగా హైడ్రా తీర్చిదిద్దుతున్న చెరువుల వివరాలు:
ప్రగతినగర్‌లోని అంబీర్ చెరువు(ప్రగతినగర్ చెరువు)
జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్ లేక్
అమీన్‌పూర్‌లోని అమీన్‌పూర్ పెద్ద చెరువు
సరూర్‌నగర్‌లోని సరూర్‌నగర్ పెద్ద చెరువు
కబ్జాలను తొలగించి 3325 ఎకరాలు ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందిలా..
ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించి – 2665
చెరువుల ఆక్రమణలు తొలగించి – 454.11
పార్కుల ఆక్రమణలు తొలగించి – 90.39
ప్రజావసరాలకు ఉద్దేశించిన ఆక్రమణలు తొలగించి – 26.31
నాలా ఆక్రమణలు తొలగించి – 25.37
రహదారులు, ఫుట్‌పాత్‌లు తొలగించి – 62.18
