30.6 C
Hyderabad
September 22, 2026
నిజామాబాద్హోమ్

డైవర్షన్ పాలిటిక్స్ లో మాస్టర్ ఈ రేవంత్ రెడ్డి

#AsannagariJeevanReddy

ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలపై పదేపదే బురద చల్లుతున్న సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ సూత్రధారి అని, కాంగ్రెస్ రక్తికట్టిస్తున్న  కపట నాటక పాత్రధారి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి  ధ్వజమెత్తారు.

ప్రజలనే కాదు, ముక్కోటి దేవుళ్ళను కూడా మోసం చేస్తున్న పచ్చి అబద్దాల కోరు  సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలకు చెందిన ఫామ్ హౌస్ ల వద్దకు భూముల పరిశీలన పేరుతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యాత్రలు రేవంత్ రెడ్డి రూపకల్పన చేసిన ఒక గోబెల్స్ గేమ్ అని, ఇదంతా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న బ్లేమ్ అని ఆయన మండిపడ్డారు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది కాంగ్రెస్ వ్యవహార శైలి అని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ సాక్షిగా కుట్ర బయటపడుతుందనే….

22A లో భూములు పెట్టి లక్షలాది మందికి నరకం చూపిస్తున్న రేవంత్ ఫాసిస్ట్ సర్కార్ పేక మేడలా కూలి పోతుందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బండారం బయట పడుతుందనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులతో అక్రమ దాడి చేయించి చితక బాదించారని, మహిళా ఎమ్మెల్యేలను అవమాన పర్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

శాసనసభను గౌరవ సభలా కాకుండా కౌరవ సభలా మార్చి అభినవ దుశ్వాసన పర్వానికి శ్రీకారం చుట్టారని ఆయన వ్యాఖ్యానించారు. అకారణంగా సస్పెన్షన్ చేసి అసెంబ్లీకి రాకుండా బీ ఆర్ఎస్ సభ్యులపై కుట్ర  చేశారని ఆయన వెల్లడించారు. ఈ పరిణామాలను చూసి సర్కార్ తీరుపై ఉమ్మేస్తున్న ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ఫ్యామిలీపై భూముల కబ్జా ఆరోపణలు తెరపైకి తెచ్చారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఒక చిన్న తప్పు ఉన్నా తన కష్టార్జితమైన 13 ఎకరాల భూమి ప్రభుత్వానికే రాసిచ్చేస్తా అని హరీష్ రావు చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము ప్రభుత్వానికి లేదా? అని ఆయన నిలదీశారు.

కేసీఆర్ కబ్జా చేయలేదని తేలితే రేవంత్ రాజీనామా చేస్తారా?

దళితుల భూములను కేసీఆర్ కబ్జా చేయలేదని తేలితే సీఎం రేవంత్, మంత్రులు రాజీనామాకు సిద్ధమా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీపై  రాజకీయ కక్షసాధింపు యాత్రలు  కాంగ్రెస్ దమననీతికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. 22ఏ నిషేధిత భూములపై ప్రశ్నిస్తే నేరమా?. ఆ మాత్రానికే ఇన్ని కక్షపూరిత చర్యలా?. కేవలం ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రధాన నేతలను బదనాం చేసేందుకే  ఈ అసంబద్ధ భూ సర్వేలు అని ఆయన పేర్కొన్నారు.

భూములు అక్రమమో, సక్రమమో నిర్ధారణ చేయడానికి అధికార యంత్రాంగం ఉండగా ఎంపీల సందర్శన ఎందుకు? అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

అక్రమ సంపాదన కోసమే పదవుల్లో రాష్ట్ర మంత్రులు కొనసాగుతున్నారని, వారి దోపిడీకి అంతు లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి  గోబెల్స్ కే ముత్తాత అని, అవినీతి బాగోతాలలో ఆయనది గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు   అని ఆయన ఎద్దేవా చేశారు. ఎర్ర బస్సు ఎక్కి వచ్చానని చెప్పిన రేవంత్ రెడ్డికి వందలాది ఎకరాల భూములు ఎక్కడివన్నారు.

ప్రభుత్వ భూమి ఇంచు కూడా లేదు..

తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఆవరణలోని వ్యవసాయ భూమిలో ఇంచు ప్రభుత్వ భూమి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. అక్రమ భూమి ఉందని తేలకుంటే తప్పు ఒప్పుకొని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా? అని జీవన్ రెడ్డి సవాల్ చేశారు. 22ఏ  నిషేధిత భూముల జాబితా ను సరిదిద్దాల్సింది పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ ల పై కాంగ్రెస్ ఎంపీలు, నాయకుల సందర్శన  దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ కు ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో కేవలం 62 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందన్నారు. ఆభూమిలోనే  వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే దానికి విరుద్ధంగా రూ.లక్ష కోట్ల విలువైన 1,000 ఎకరాల భూమి ఉందని రేవంత్ రెడ్డి అనడం దారుణమని ఆయన విమర్శించారు. కేసీఆర్ కు నీతి నిజాయితీ గురించి  ఎవరి సర్టిఫికెట్  అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

కేసీఆర్ పలుమార్లు ప్రజా మద్దతుతో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా, కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన గొప్ప నాయకుడుగా ఆయన అభివర్ణించారు. సమున్నత  ఉద్యమ చరిత్ర ఉన్న కేసీఆర్ ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించే ప్రసక్తే లేదన్నారు. ఆయన నీతిగా నిజాయితీగా పట్టా భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారన్నారు. కేసీఆర్ నిబద్ధతతో ప్రజా మద్దతుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు.

తొలి ముఖ్యమంత్రి గా ప్రజల సంక్షేమం తో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారన్నారు.

అసత్య వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్

అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పదవులు కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీపై దురుద్దేశ పూరితమైన కక్ష సాధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతు బంధు, రైతు బీమా, గురుకుల విద్యాలయాల నిర్వహణ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తదితర పథకాలన్నీ నిర్వీర్యమ య్యాయని  ఆయన అన్నారు.

ఇక దేశంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయపరంగా బద్ధ శత్రువులైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతీ దానికి ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ పైనే అనవసరపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతూ నీచ రాజకీయం చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. 22A నిషేధిత జాబితాలో లక్షలాది ఎకరాలు పెట్టి, ప్రజలను నరకయాత్రకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బీ ఆర్ఎస్ ప్రశ్నిస్తున్న దన్నారు.

సమస్యను పరిష్కరించకుండా బీ ఆర్ఎస్ పైనే ఎదురుదాడికి దిగుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఏకంగా 30 లక్షల ఎకరాలను 22A లో పెడితే ఆ రైతులు, ప్రజలు ఎంత ఇబ్బంది పడి ఉంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుబంధు రాక, యూరియా అందక, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం భూములు అమ్ముకోలేక నానా అవస్థలు పడుతున్నారని  జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది కుటుంబాల సమస్యలు పరిష్కరించమని అడిగితే రేవంత్ రెడ్డి రాచరిక పోకడలతో, అహంకార ధోరణితో వ్యవహరిస్తారా?  అని ప్రశ్నించారు.

22A లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తిందో, ముఖ్యమంత్రి తమ్ముళ్ల భూ కుంభకోణాలను ఎప్పుడైతే బయటపెట్టిందో,మంత్రి పొంగులేటి ఆయన కొడుకు చేస్తున్న భూ దందాలను ఎప్పుడైతే ఎండగట్టిందో, అప్పుడే కుట్ర బుద్ధితో కక్షకట్టి  బీ ఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు. సభలో ప్రతిపక్షం ఉంటే ప్రభుత్వ బండారం బయటపడుతుందనే దురుద్దేశంతోనే సస్పెండ్ చేసి ఏకపక్షంగా సభను నడిపారని విమర్శించారు.

బీ ఆర్ఎస్ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో బీ ఆర్ఎస్ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మరింత  ఉధృతంగా పోరాడుతామని, కాంగ్రెస్ పగబట్టి దండయాత్రలు చేసినా, అక్రమ కేసులు పెట్టి బురద రాజకీయాలు చేసినా  వదిలిపెట్టేది లేదని గులాబీ సైన్యం పోరాటం ఎప్పుడూ ప్రజల పక్షమేనని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Related posts

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వైభవంగా శ్రావణ ఉపకర్మ

Satyam News

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

Satyam News

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

Satyam News

ఆసక్తి కలిగిస్తున్న భారత్ బ్రెజిల్ వాణిజ్య ఒప్పందం

Satyam News

ఉన్మాద కామెంట్లు ఎందుకు? ఏమిటి ప్రయోజనం?

Satyam News

మంత్రి పొంగులేటి తో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ

Satyam News

Leave a Comment