హైదరాబాద్హోమ్

మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం

#EtalaRajendar

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇస్కాన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మానవ జీవితం గొప్పగా, ఆదర్శవంతంగా ఉండాలని బోధిస్తుందని అన్నారు. భారతదేశం తన విశ్వాసం, ఆధ్యాత్మిక విలువలు, మానవ సంబంధాలకు ఇచ్చే ప్రాధాన్యం వల్లనే ప్రత్యేకతను నిలుపుకుంటోందని పేర్కొన్నారు.

“హరే కృష్ణ హరే కృష్ణ.. కృష్ణ కృష్ణ హరే హరే” అనే మహామంత్రం ప్రస్తుతం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఒకప్పుడు పాశ్చాత్య నాగరికతపై భారతీయుల్లో ఆకర్షణ ఎక్కువగా ఉండేదని, అయితే ఇస్కాన్ వంటి సంస్థలు భారతీయ ఆధ్యాత్మికత, సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని అన్నారు. అమెరికా గడ్డపై ఇస్కాన్ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన గురువులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌కు వేలాది కేంద్రాలు ఏర్పడి కోట్లాది మంది ప్రజల హృదయాలను ఆధ్యాత్మికత వైపు మళ్లించాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సనాతన ధర్మం, విశ్వాసానికి భారతదేశం మారుపేరని, ఒకప్పుడు భారత్ విశ్వగురుగా నిలిచిందని అన్నారు. తిరిగి ఆ స్థానాన్ని సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

భారతీయ ఇతిహాసాల్లోని రామాయణం, మహాభారతం వంటి గ్రంథాల్లో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారని ఈటల రాజేందర్ అన్నారు. మహాభారతంలో అర్జునుడు యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల ప్రస్తావన ఆ కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచంలోని కోట్లాది జీవుల్లో స్పందించి, మాట్లాడి, ఆలోచించే సామర్థ్యం కలిగిన జీవి మనిషేనని, అందుకే మానవ జీవితం గొప్పగా ఉండాలని బోధించేదే సనాతన ధర్మమని ఆయన అన్నారు. కలియుగంలోనూ మానవ సంబంధాలను పరిపుష్టం చేయడంలో గురువుల ధర్మబోధనలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం, పరస్పరం సహకరించుకోవడం, మానవ సంబంధాలను కాపాడుకోవడం సమాజానికి ఎంతో అవసరమని అన్నారు.

దేశంలో ఉన్న అనేక సామాజిక రుగ్మతలను కేవలం ప్రభుత్వాలు మాత్రమే నిర్మూలించలేవని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషాముక్త్ భారత్’ పిలుపును ప్రస్తావిస్తూ, ఇలాంటి సామాజిక సమస్యలను రూపుమాపడంలో హరే కృష్ణ వంటి ఆధ్యాత్మిక సంస్థలు కూడా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశం ఇంతటి జనాభా ఉన్నప్పటికీ గొప్ప దేశంగా, ఆదర్శవంతమైన సమాజంగా నిలుస్తోందంటే అందుకు మన విశ్వాసం, ఆధ్యాత్మిక తత్వం, సంస్కృతి ప్రధాన కారణాలని ఈటల రాజేందర్ అన్నారు. దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులతో మాత్రమే కొలవలేమని, మానవ సంబంధాలు కూడా దేశ ప్రగతిలో అంతే ముఖ్యమైనవని చెప్పారు.

ఇస్కాన్ వేడుకల్లో భక్తులు చూపుతున్న ఉత్సాహం, ఆధ్యాత్మిక భావన డబ్బుతో కొనలేనిదని, భక్తి ద్వారా మాత్రమే పొందగలిగే అనుభూతి అని ఈటల రాజేందర్ అన్నారు. ఆధునిక జీవితంలో ఎన్నో సౌకర్యాలు, సంపద అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రేమ, మానవ సంబంధాలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ, సామాజిక సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితుల్లో రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు అందించే విలువలను ఆచరించడం ద్వారా మానవ సంక్షేమానికి బాటలు వేయవచ్చని అన్నారు.

సమాజంలో పెరుగుతున్న అలజడి, మానవ సంబంధాల్లో ఏర్పడుతున్న దూరాలను తొలగించడంలో గురువుల బోధనలు, సనాతన ధర్మ సందేశం కీలకమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సనాతన ధర్మంలోని మానవతా విలువలు, ప్రేమ, పరస్పర సహకారం, భక్తి వంటి అంశాలను ప్రతి ఒక్కరూ పదిలంగా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

హత్యలే రాజకీయం గా ఎదిగిన వైఎస్ కుటుంబం

Satyam News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

ప్రశ్నించే హక్కా? హద్దులు లేని ప్రవర్తనా?

Satyam News

ఆసక్తి కలిగిస్తున్న భారత్ బ్రెజిల్ వాణిజ్య ఒప్పందం

Satyam News

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు..

Satyam News

Leave a Comment