రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు మాదిరిగా దోపిడీ చేస్తూ ప్రజా పాలన అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లేదా ? అని మాజీమంత్రి, బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన జనగాం పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ముందుగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా పాలన అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు.
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు.
కేసీఆర్ పాలనలో అన్నపూర్ణగా మారిన తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు కు ముందు నీళ్ళు, విద్యుత్ కోసం ప్రజలు అల్లాడిపోయారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల విద్యుత్ సరఫరా, చెరువుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం వలన ధాన్యం ఉత్పత్తి లో మొదటి స్థానంలో నిలిచి దేశానికే అన్నపూర్ణ గా మారిందని వివరించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్, నీటి సమస్యలు ఎందుకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పంట పెట్టుబడి కోసం రైతు బందు క్రింద ఆర్ధిక సహాయం, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే రైతు భీమా అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచామని చెప్పారు. అదేవిధంగా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ క్రింద లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందించామని, జిల్లాకో మెడికల్ కాలేజీని కేసీఆర్ ప్రభుత్వం లో నిర్మించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని, విద్యార్ధినీలకు స్కూటీలు, వికలాంగుల పెన్షన్ ను 6 వేల రూపాయల కు పెంచుతామని మేనిఫెస్టో లో ప్రకటించలేదా అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు వివరించి దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో మోసం
వెయ్యి రోజులలో బ్రహ్మాండమైన పాలన అందించామని పెద్ద పెద్ద ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో వేడుకలు చేయకుండా ఢిల్లీలో ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలి ఢిల్లీలో తమ పార్టీ పెద్దలకు ఊడిగం చేయడానికి వెళ్లారని విమర్శించారు.
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, విమర్శలు చేసుకుంటూ తెలంగాణ పరువును తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చిన, పేదల ఇండ్లు, భూముల ను 22 ఏ పరిధిలోకి తీసుకొచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీ యంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ని పాలిటెక్నిక్ కాలేజీల ఆస్థులను కాజేసేందుకు పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీ లకు అనుసంధానం చేసేందుకు జిఓ 97 తీసుకొచ్చారని అన్నారు. ఈ నెల 7 వ తేదీ లోగా జిఓ 97 ను రద్దు చేయకుంటే అసెంబ్లీ ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ప్రజలు కూడా కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బి ఆర్ ఎస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
