ప్రత్యేకంహోమ్

మరో ప్రమాదం పొంచి ఉంది: నేపాల్ కు భారీ వరద హెచ్చరిక

#NepalFloods

అతి తీవ్ర విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే నేపాల్ కు మరో ప్రమాదం ముంచుకు వస్తున్నదే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 26న సంభవించిన భారీ ఆకస్మిక వరదల విషాదం నుంచి నేపాల్ దేశం ఇంకా కోలుకోకముందే మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భోటెకోషి నదిలో ఆదివారం నీటిమట్టం మళ్లీ కొంతమేర పెరిగిందని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ సంస్థ (NDRRMA) హెచ్చరించింది.

వరద ప్రభావిత జిల్లాల్లోని ప్రజలు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత ఫ్లాష్‌ ఫ్లడ్స్‌లో మృతుల సంఖ్య ఆదివారం నాటికి 734కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. వీరిలో సుమారు 320 మంది విదేశీయులు ఉన్నారు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని హిమాలయ ప్రాంతంలో మంచు, రాళ్ల భారీ కొండచరియలు కూలిపోవడం లేదా హిమపాతం సంభవించడం ఈ విపత్తుకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

భోటెకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో దిగువ ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం భోటెకోషి నదిలో నీటిమట్టం మళ్లీ పెరిగినట్లు NDRRMA ప్రకటించింది. పరిస్థితిపై మరింత సమాచారం అందిన తర్వాత తాజా వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.

చైనా వైపు హిమాలయ ప్రాంతంలో ఏర్పడిన ఓ సరస్సు కారణంగా నేపాల్‌లో మరోసారి భారీ వరదలు సంభవించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 26న హిమనదం కూలిన ఘటన అనంతరం చైనా వైపు సహజ అడ్డంకి వెనుక నీరు చేరి సరస్సు ఏర్పడింది. అయితే శనివారం నాటికి ఆ సరస్సు పరిమాణం తగ్గుముఖం పట్టడంతో భారీ స్థాయిలో నీరు ఒక్కసారిగా విడుదలయ్యే ప్రమాదం కొంత తగ్గినట్లు చైనా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఆదివారం మరో తాజా సమాచారం ఆందోళన రేకెత్తిస్తున్నది. సహజ నీటి అడ్డంకి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మరో ‘డ్యామ్ లేక్’ ఏర్పడినట్లు సమాచారం వెలువడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సహాయక, రక్షణ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. దీంతో నేపాల్ అధికారులు అప్రమత్తమయ్యారు.

చైనా వైపు కూడా ఈ విపత్తు తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ 16 మంది మరణించగా, దాదాపు 550 మంది ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం నేపాల్‌లో 275 మందికి పైగా భారతీయులు, భారతీయ మూలాలున్న 128 మంది ఇంకా గల్లంతైనట్లు లేదా వారితో సంబంధాలు ఏర్పడలేదని తెలిపింది. మరో 108 మంది భారతీయులను రక్షించినట్లు వెల్లడించింది.

నేపాల్ ప్రభుత్వం భారీ స్థాయిలో సహాయక చర్యలను చేపట్టింది. దాదాపు 20 వేల మంది భద్రతా సిబ్బందిని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో మోహరించింది. చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు హెలికాప్టర్లు వరుసగా సేవలు అందిస్తున్నాయి. నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 4,500 మందికి పైగా ప్రజలను రక్షించారు. శోధన, సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది.

Related posts

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Satyam News

శ్రీశైలంలో భారీ గా పెరిగిన భక్తుల రద్దీ

Satyam News

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

Satyam News

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

జోర్డాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడి

Satyam News

కాంక్రీట్ జంగిల్ మధ్య ‘గ్రీన్ లంగ్స్’గా నగర వనాలు

Satyam News

Leave a Comment