తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల శోభ తిరుపతి నగరంలోనూ వెల్లివిరుస్తోంది. శ్రీవారి వాహనసేవలను వీక్షించేందుకు తరలివచ్చే భక్తులకు తిరుపతిలోనే భక్తి, ఆధ్యాత్మికత, ఉత్సవ వైభవంతో కూడిన ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేలా టీటీడీ విస్తృతంగా విద్యుద్దీపాలంకరణలు చేపట్టింది.
తిరుపతి నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, టీటీడీ భవనాలు, పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్లు తదితర ప్రాంతాలు రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారాయి. ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు రాత్రివేళ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణ
తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్వాగత తోరణాలతోపాటు, శ్రీవారి దశావతారాలు, మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మీ సమేత మహావిష్ణువు, శ్రీ వేంకటేశ్వరస్వామివారు, విశ్వరూపం, హృదయలక్ష్మి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అష్టలక్ష్ముల విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
గరుడ సర్కిల్ వద్ద తొలిసారిగా ఏర్పాటు చేసిన కృత్రిమ ఏనుగుల విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరుడ విగ్రహం సర్కిల్, అలిపిరి టోల్‌గేట్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విద్యుత్ అలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి.
ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలు
బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమాచారం భక్తులకు చేరేలా తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వాహనసేవలు, బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తదితర సమాచారాన్ని భక్తులకు అందిస్తున్నారు.
విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి
టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశాల మేరకు, జేఈవో డా. ఎ. శరత్ సూచనలతో టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలోని ఎలక్ట్రికల్ విభాగం విద్యుద్దీపాలంకరణల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నగరంలోనూ భక్తి, ఆధ్యాత్మికత, ఉత్సవ వైభవం వెల్లివిరిసేలా చేపట్టిన విద్యుద్దీపాలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. విద్యుద్దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతున్న తిరుపతి నగరం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవానికి అద్దం పడుతోంది.
