మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ అధికారులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మహా లక్ష్మీ పథకం విజయవంతానికి నిరంతరం శ్రమిస్తున్న డ్రైవర్లు , కండక్టర్లు , శ్రామిక్ ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖ మంత్రి గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎండీ , ఈడి లు సత్కరించారు.
ఆర్టీసీని మరింత విస్తృత పర్చాలని క్షేత్ర స్థాయిలో రాజధాని నుండి గ్రామాల వరకు ఆర్టీసీ కొత్త రూట్లను అన్వేషించి ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడిపించేలా కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ నగరంలో గత మూడు నెలలుగా సర్వే చేసి 373 కొత్త రూట్లలో ఈరోజు నుండి ప్రజా రవాణా అయిన ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
దీని ద్వారా రింగ్ రోడ్డు వెలుపల ఉన్న దాదాపు 7 లక్షల మందికి కొత్తగా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పడిందని హర్షం వ్యక్తం చేశారు. కొత్త రూట్లు లో బస్సులు నడిపినప్పుడే విజన్ 2047 లో మన లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పుడున్న 28 శాతం ప్రజా రవాణా ను 70 శాతానికి పెంచుకోవడానికి సాధ్యం అవుతుందని సూచించారు.
అందుకోసం ఇపుడున్న ఆర్టీసీ మూడింతల వ్యవస్థ అవసరమని అందుకు ఉద్యోగులు సిబ్బంది కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తమకు సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ప్రథమ కర్తవ్యమని ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ సిబ్బంది స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించారు.
కుటుంబ సభ్యులలాగే అందరిని చూడండి
అటు అధికారులు సైతం ఆర్టీసీ సిబ్బంది విషయంలో కఠినంగా కాకుండా కుటుంబ సభ్యుల మాదిరి వ్యవహరించాలని అప్పుడే వారు సంస్థ కోసం మరింత పనిచేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇటీవల సిరిసిల్ల లో జరిగిన ఘటనలో డ్రైవర్ కి సంస్థ అండగా ఉందన్నారు.
మీ ప్రతినిథి గా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తో చర్చిస్తున్నానని ఆర్థిక పరమైన అంశాలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసి సంస్థ ఉనికికే ప్రశ్నార్థకంగా మారిందని ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ద్వారా 90 కి పైగా డిపోలు లాభాల బాటలో ఉన్నాయని తెలిపారు.
మిగిలిన డిపోలు కూడా లాభాల్లోకి వచ్చేలా పని చేయాలని ఆదేశించారు. గతంలో 2011 లో నియామకాలు జరిగితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 3038 పోస్టులకు డ్రైవర్ , శ్రామిక్, సూపర్ వైజర్ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయని ,2014 తరువాత మళ్ళీ తమ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో 2476 నూతన బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు.
రికార్డు స్థాయిలో కారుణ్య నియామకాలు
అంటే ఇప్పుడున్న బస్సుల్లో 40 శాతం ఈ రెండు సంవత్సరాల కాలంలో వచ్చినవే అని , సంస్థ లో కారుణ్య నియామకాలు కింద బ్రెడ్ విన్నర్ స్కిం కింద 800 మెడికల్ అన్ ఫిట్ కింద 390 మంది మొత్తం 1190 మందిని నియమించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నూతనంగా పెద్దపల్లి ,ములుగు జిల్లా ఏటూరు నాగారం లకు కొత్త డిపోలు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో బస్ స్టేషన్ ల అభివృధి చేస్తున్నామని పేర్కొన్నారు.
కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈవీ బస్సులు
వచ్చే రెండు సంవత్సరాల్లో నగరంలో 2800 ఈవీ బస్సులు నడుస్తున్నాయని పూర్తి స్థాయిలో కాలుష్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ బస్సులు వస్తున్నాయని ఈరోజు 65 బస్సులు వచ్చాయన్నారు. ఇప్పటికే 810 ఈవీ బస్సులు హైదరాబాద్ ,నల్గొండ ,కరీంనగర్ , నిజామాబాద్ ,వరంగల్ లో నడుస్తున్నాయని వచ్చే జనవరి లో మరో 175 బస్సులు వస్తున్నట్లు వెల్లడించారు.
సెర్ప్ మహిళా శక్తి కింద మండల మహిళ సంఘాలకు 152 బస్సులు ఆర్టీసీ లో ఉండగా త్వరలోనే 448 బస్సులు మహిళా సమైక్య సంఘాల నుండి రానున్నాయని తెలిపారు. 2047 విజన్ లో ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లో రవాణా శాఖ కీలక పాత్ర పోషించాలని తెలిపారు.
దేశంలో అత్యున్నత సంస్థగా ఆర్టీసీ ఎదగాలని ఆశించారు. బస్ స్టేషన్ ల ముందు ప్రైవేట్ వెహికిల్ లలో ప్రయాణికులను తరలిస్తే కేసులు బుక్ చేసి వాహనాలు సీజ్ అయ్యేలా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆర్టీసీ పిల్లలు చదువుకోవడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ స్కూల్ ఉండేలా ప్రభుత్వం తో మాట్లాడతానని తెలిపారు. సమీక్షా సమావేశంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ,ఈడీలు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్,ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
