జాతీయంహోమ్

ఫారం 6 మార్పులపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన

#SupremeCourtOfIndia

కేంద్ర ఎన్నికల సంఘం ఫారం 6 లో చేసిన మార్పులపై తాము ఆమోదం తెలపలేదని, అలాగే తిరస్కరించలేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి. మోహన కూడా ఉన్నారు. సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్నికల సంఘం సవరించిన ఫారం–6కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినట్లు ప్రచారం చేస్తోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అక్టోబర్‌ 5న కోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సవరించిన ఫారానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలపలేదని ఇప్పటికే ప్రకటించిందని, ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

బిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన కేసు విచారణ జరిగిన సమయంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న కొత్త ఫారం–6 ఉనికిలోనే లేదని జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి వివరించారు. దీనిని కోర్టు ఆమోదించినట్లుగానీ, తిరస్కరించినట్లుగానీ భావించరాదని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ కూడా ఈ అంశంపై కొత్త ఫారానికి సంబంధించి ఎలాంటి దరఖాస్తు తమ ముందుకు రాలేదని పేర్కొంటూ, కోర్టు వ్యాఖ్యలను తమకు అనుకూలంగా అర్థం చేసుకోవద్దని పిటిషనర్‌ న్యాయవాదికి సూచించారు.

తొలిసారిగా ఓటరుగా నమోదు కావాలనుకునే వ్యక్తి తన పేరు లేదా తన తల్లిదండ్రులు, తాతముత్తాతల పేర్లు గతంలో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణకు సంబంధించిన పాత జాబితాలో ఉన్నాయా లేదా అన్న వివరాలను ఫారం 6లో చెప్పాలని నిబంధన కొత్తగా తీసుకువచ్చారు.

ఈ అదనపు నిబంధన కొత్త ఓటర్లకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పేర్లు పాత ఓటరు జాబితాల్లో లేని వారికి ఓటరుగా నమోదు కావడం మరింత కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సంబంధిత నిబంధనలను సవరించకుండా చట్టబద్ధమైన దరఖాస్తు పత్రంలో అదనపు ప్రకటనను చేర్చడం సముచితమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

Related posts

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News

తిరుపతి నగరంలో వైసీపీ గూండాల అరాచకం

Satyam News

పెట్రోల్, డీజిల్ తో పాటు వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News

Leave a Comment