కూటమి ప్రభుత్వం రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వనుంది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనుంది. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా గ్రామసభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూశాఖ చర్యలు ప్రారంభించింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మలతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చింది.
దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. తమ భూముల పట్టా పుస్తకాలపై జగన్ ఫోటోను ముద్రించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వెంటనే రూ.22.50 కోట్లు విడుదల చేసింది.
పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణ పూర్తయినా, పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్‌పుస్తకాల్ని వెంటనే రైతులకు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
దీంతో రెవెన్యూశాఖ జనవరి 2 నుంచి 9 వరకు గ్రామసభల ద్వారా పంపిణీకి కార్యాచరణ రూపొందించింది.
సీఎం చంద్రబాబు ఆదేశాలు
పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలి. పట్టాదారుల వివరాల్ని వెబ్‌ల్యాండ్‌లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూడాలి. ఎలాంటి తప్పులు లేని పాస్‌పుస్తకాలు అందజేయాలి. వేలిముద్ర ద్వారా సంబంధిత పట్టాదారుకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి.
ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి. పంపిణీ ప్రక్రియ VRO ఆన్‌లైన్ E-KYC ద్వారా నిర్వహించాలి. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు తీసుకోవాలి. ఇది ఒక రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి.
ఇక పాత భూహక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి.ఐతే ముద్రయిన పూర్తయిన పట్టాదారు పాసు పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లినట్లు సమాచారం.
వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వాటినే ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోనూ పుస్తకాలు వచ్చాయి. ఫోన్, ఆధార్ నంబర్లతోపాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లలోనూ అక్షరదోషాలు ఉన్నాయి. వీటిని సరిదిద్దేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
