ముఖ్యంశాలుహోమ్

ఆర్టీజీఎస్‌తో  2,259 అంబులెన్సుల అనుసంధానం

#Satyakumaryadav

తుపాను ప్రభావం కారణంగా అవసరమైన వారికి వెనువెంటనే వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. వైద్య సేవల్లో లోపం రాకుండా ఉండేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు.

తుపాను ప్రభావం తగ్గిన అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. తుపాను కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేందుకు జనరేటర్ల వినియోగానికి అవసరమైన ఇంధనాన్ని అదనంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు మొత్తం 8,441 అత్యవసర పడకలను అందుబాటులో ఉంచామని తెలిపారు.

1,050 వైద్య బృందాలను సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 38 బాధితుల సహాయక శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించిన 20 జిల్లాల్లోని 96 మండలాల్లో వైద్య సేవల కొనసాగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

ఈ 96 మండలాల్లో 1,176 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని చెప్పారు. తుపాను స‌న్న‌ద్ధ‌త‌పై మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మంగళవారం సాయంత్రం వర్చువల్‌గా వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఆహార భద్రత విభాగం డైరెక్టర్‌ అరుణ్‌బాబు, వైద్య విద్య సంచాలకుడు డాక్ట‌ర్  విష్ణువర్ధన్‌, ప్రజారోగ్య సంచాలకుడు డాక్ట‌ర్ వెంకటరమణ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అధికారులతో క్షుణ్ణంగా చర్చించిన అనంతరం ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని, పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి  సత్యకుమార్‌ యాదవ్‌ శాఖాపరమైన సన్నద్ధత వివరాలను పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

108, 104, 102 వాహ‌నాల‌తో పాటు ప్రైవేట్ అంబులెన్స్‌లు కూడా సిద్ధం

రాష్ట్రంలో 108, 104 (సంచార వైద్యశాలలు), 102 (తల్లీబిడ్డ) వాహనాలు మొత్తం 1,892ను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌ (ఆర్టీజీఎస్‌)తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. బాధితుల అవసరాలకు అనుగుణంగా ఈ వాహనాలను సంబంధిత ప్రాంతాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా అవసరాలకు అనుగుణంగా ప్రైవేటు అంబులెన్సులను వినియోగించుకునేందుకు వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 367 ప్రైవేటు అంబులెన్సులను వినియోగించుకునేందుకు ఆర్టీజీఎస్‌ ద్వారా అనుసంధానం చేసినట్లు చెప్పారు. దీనివల్ల బాధితులకు సత్వరం వైద్య సేవలు అందించేందుకు వీలుంటుందని వెల్లడించారు.

పాముకాటు విరుగుడు ఇంజెక్షన్లు, ఇతర మందులు సిద్ధం

తుపాను సమయంలో అత్యవసరంగా అవసరమయ్యే యాంటీబయాటిక్స్‌ మందులు, అంటువ్యాధుల కట్టడికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యంగా పాముకాటు ఘటనలను దృష్టిలో పెట్టుకుని 26,500 ఏవీఎస్‌ ఇంజెక్షన్లను సిద్ధం చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు మందుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

హెచ్చరికల ఆధారంగా మండలాల స్థాయిలో మరింత అప్రమత్తం

వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా తుపాను ప్రభావిత జిల్లాలు, మండలాలను గుర్తిస్తూ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీ సత్యకుమార్‌ తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం వర్షాలు, గాలుల తీవ్రతపై వచ్చిన హెచ్చరికలతో 20 జిల్లాల్లోని 255 మండలాల్లో ఆసుపత్రుల వైద్యులు, సిబ్బందిని మరింత అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఇవి శ్రీకాకుళం నుంచి బాపట్ల జిల్లాల వరకు ఉన్నాయని చెప్పారు. అలాగే  సచివాలయాల వారీగా కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విశాఖలాంటి చోట్ల ప‌ట్ట‌ణ ఆరోగ్య కేంద్రాల్లో 24 గంట‌లూ వైద్య సేవ‌లు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని చెప్పారు.

2,838 మంది గర్భిణీల‌ తరలింపు

ప్రసవ తేదీకి దగ్గర్లో ఉన్న 2,838 మంది గర్భిణీల‌ను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినట్లు మంత్రి శ్రీ సత్యకుమార్‌ వెల్లడించారు. ప్రసవ తేదీ ఆధారంగా స్థానిక వైద్యుల నుంచి సేకరించిన సమాచారంతో గర్భిణులను ఆసుపత్రులకు పంపుతున్నామన్నారు. తుపాను కారణంగా ప్రసవ సమయంలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నీటి నాణ్యత పరీక్షలకు చర్యలు

తుపాను పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సహాయక శిబిరాలకు సరఫరా చేసే నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఆహార భద్రత శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేశామన్నారు. తుపాను ప్రభావం అనంతరం ప్రబలే అంటువ్యాధులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ప్రాంతాల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వివరించారు.

ప్రభుత్వ శాఖలతో సమన్వయం.. సత్వర వైద్య సేవలకు సిద్ధం

వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో సీనియర్‌ వైద్యులు, అధికారులు 24 గంటలపాటు పనిచేస్తున్నారని మంత్రికి వివరించారు.  తుపాను ప్ర‌భావిత జిల్లాల్లో టీకాల కార్య‌క్ర‌మాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామ‌న్నారు. వైద్య విద్య సంచాలకుడు విష్ణువర్ధన్‌, ప్రజారోగ్య సంచాలకుడు వెంకటరమణ, సంయుక్త సంచాలకుడు అర్జునరావు, ఆహార భద్రత విభాగం డైరెక్టర్‌ అరుణ్‌బాబు తమ శాఖల పరిధిలో తీసుకుంటున్న చర్యల గురించి మంత్రికి వివరించారు.

Related posts

ఈ స్వరాభిషేకం సినిమా కథ కాదు

Satyam News

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

Satyam News

తీవ్ర రూపం దాల్చిన యుక్రెయిన్ రష్యా యుద్ధం

Satyam News

కాకినాడలో స్పేస్‌ స్టేషన్‌…. హోప్‌ ఐలాండ్‌ నుంచి రాకెట్లు..!!

Satyam News

దురంధర్ 2 కోసం ఎదురుచూపు…. కధ ఏమిటంటే…

Satyam News

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

Leave a Comment