హోర్ముజ్ జల సంధి వద్ద భారత్ నౌకపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. శుక్రవారం నాడు హోర్ముజ్ జల సంధి వద్ద భారత నౌకపై దాడి జరిగింది. అయితే ఈ దాడిలో భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారని వార్తా సంస్థలు వెల్లడించాయి.
అక్టోబర్ 16న 15 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ముడి చమురు రవాణా నౌకపై గుర్తుతెలియని క్షిపణి ఒకటి దాడి చేసినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. అయితే ఈ ఘటనలో నౌకలో ఉన్న భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు.
దాడికి గురైన నౌక పేరు ఎంటీ ఎస్టీ 3. నౌకపై దాడి చేసినవారు ఎవరన్నది, దాడి వెనుక కారణాలేమిటన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియరాలేదు. నౌకకు ఎంతమేర నష్టం వాటిల్లిందనే వివరాలను కూడా అధికారులు వెల్లడించలేదు. పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, నౌకల నిర్వహణ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారతీయ నావికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సోనోవాల్ తెలిపారు.
అక్టోబర్ 14న రొమేనియాలోని సులినా నౌకాశ్రయ ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న యారా జే అనే రసాయనాల రవాణా నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలోనూ నావికులందరూ సురక్షితంగా ఉన్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 24 మంది భారతీయ నావికులు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడినప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఈ జలసంధికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇక్కడ నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ చమురు సరఫరా, ఇంధన ధరలు, సముద్ర రవాణా వ్యయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. వరుసగా చోటుచేసుకుంటున్న దాడులు నౌకాయాన భద్రతను మరింత ప్రాధాన్య అంశంగా మార్చాయి. భారతీయ నావికుల క్షేమాన్ని నిర్ధారించడంతో పాటు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
