ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చాలని చూసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఊహించని విధంగా తన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ లో ప్రభుత్వం మారుతున్నది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పాలనకు ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష నేత, యషార్ పార్టీ అధినేత గాడి ఐసెన్కోట్ను ఆహ్వానించారు.
ఇజ్రాయెల్ పార్లమెంటు అయిన నెస్సెట్లోని మొత్తం 120 మంది సభ్యుల్లో 67 మంది ఐసెన్కోట్కు మద్దతుగా అధ్యక్షుడు హెర్జోగ్కు సిఫారసు చేశారు. మరోవైపు ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీకి చెందిన కూటమికి 46 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. ఏడుగురు సభ్యులున్న ఒక కూటమి మాత్రం ఎవరి పేరునూ సిఫారసు చేయలేదు. ఈ పరిణామంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించే విషయంలో ఐసెన్కోట్కు ప్రాధాన్యత లభించింది.
గత నెల 27న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి 53 స్థానాలు లభించగా, ఐసెన్కోట్కు మద్దతుగా ఉన్న నాలుగు పార్టీల కూటమికి 48 స్థానాలు వచ్చాయి. ఇజ్రాయెల్ అరబ్ మైనారిటీకి ప్రాతినిధ్యం వహించే రెండు పార్టీలకు కలిపి 19 స్థానాలు లభించాయి. ఈ రెండు పార్టీలతో సహా ఐసెన్కోట్కు మద్దతు ప్రకటించిన పార్టీల బలం 67కు చేరింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 61 మంది సభ్యుల మద్దతును ఒక కూటమిగా సమీకరించడం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన సవాలు.
ఐసెన్కోట్కు అధ్యక్షుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ఆహ్వానం అందించిన తర్వాత 28 రోజుల గడువు ఉంటుంది. ఈ సమయంలో ఆయన మెజారిటీ సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజుల గడువు పొడిగించవచ్చు.
మాజీ సైనికాధికారి అయిన గాడి ఐసెన్కోట్ 2022లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. గతంలో ఇజ్రాయెల్ సైన్యాధిపతిగా పనిచేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల అనంతరం నెతన్యాహు ఏర్పాటు చేసిన యుద్ధకాల మంత్రివర్గంలో కొంతకాలం పనిచేశారు. అనంతరం ప్రభుత్వ విధానాలపై విభేదాలతో ప్రతిపక్షంలోకి వెళ్లారు. గాజా యుద్ధ నిర్వహణ, దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో నెతన్యాహు నాయకత్వాన్ని ఆయన బహిరంగంగా విమర్శించారు. నెతన్యాహుతో కలిసి ప్రభుత్వంలో పనిచేయబోనని కూడా గతంలో స్పష్టం చేశారు.
అయితే ఐసెన్కోట్కు మద్దతుగా నిలిచిన అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. ఆయనకు మద్దతు ప్రకటించిన యూదు పార్టీల్లో కొన్ని అరబ్ పార్టీలతో అధికార భాగస్వామ్యానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు, అల్ట్రా ఆర్థడాక్స్ మతపరమైన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా రాజకీయ చర్చల్లో ఉన్నాయి. నెతన్యాహుతో కలిసి జాతీయ ఐక్యతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన నాయకుడిగా బెంజమిన్ నెతన్యాహుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తాజా ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని కూటమి మెజారిటీ కోల్పోవడం, 67 మంది పార్లమెంటు సభ్యులు ఐసెన్కోట్ పేరును సిఫారసు చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఐసెన్కోట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే, అధ్యక్షుడు మరో నాయకుడికి అవకాశం కల్పించవచ్చు. ఈ ప్రక్రియలోనూ ఎవరూ మెజారిటీ సాధించలేకపోతే ఇజ్రాయెల్లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
