ప్రపంచంహోమ్

ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు?

#DonaldTrump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై మధ్యంతర ఎన్నికలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, మందుల ధరలు, సామాజిక భద్రత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలు ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి.

మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌కు చెందిన 34 ఏళ్ల బ్రిటానీ హామ్లిన్ వృత్తిరీత్యా డేటా విశ్లేషకురాలు. తన అమ్మమ్మకు సంరక్షకురాలిగా కూడా వ్యవహరిస్తున్న ఆమె, పెరుగుతున్న వైద్య ఖర్చులు, మందుల ధరలు తన ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేశాయని చెప్పారు. మిషిగన్ సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్‌కు ఓటు వేసినట్లు వెల్లడించారు.

మందుల రేట్లు పెరగడం భరించలేం

సామాజిక భద్రతా పథకాలను కాపాడటం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి అంశాల్లో ఎల్-సయీద్ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్ ఔషధ పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తారని, సామాన్య ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయరని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

డెట్రాయిట్‌కు చెందిన 34 ఏళ్ల నటాలియా టౌన్స్ కూడా ఎల్-సయీద్‌కు మద్దతుగా ఓటు వేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్ ఒక నల్లజాతీయుల చర్చిలో పాల్గొనడాన్ని ఆమె రాజకీయ ప్రచారంలో భాగంగానే చూశారు.

గతంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వ పోటీలో ఎల్-సయీద్‌తో పోటీపడిన హేలీ స్టీవెన్స్, తాజాగా రోజర్స్‌కు మద్దతు ప్రకటించడం కూడా ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం తెచ్చింది. ప్రజల మద్దతు పొందాలంటే ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం వారి మధ్య ఉండాలని నటాలియా వ్యాఖ్యానించారు.

వారెన్ నగరానికి చెందిన 63 ఏళ్ల పాల్ స్టాకిజ్ మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి మైక్ రోజర్స్‌కు ఓటు వేశారు. హేలీ స్టీవెన్స్ రిపబ్లికన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చాలా అరుదైన రాజకీయ పరిణామమని, దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అబ్దుల్ ఎల్-సయీద్ విధానాలు తన అభిప్రాయం ప్రకారం మరీ ఎక్కువ ప్రగతిశీలంగా ఉన్నాయని, ఆయన ప్రతిపాదిస్తున్న కార్యక్రమాలకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న ఉందని అన్నారు. చివరికి ఆ ఖర్చును ప్రజలే భరించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.

వలస విధానాలే ఎన్నికలలో ప్రధాన అంశం

చికాగోలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న 29 ఏళ్ల ర్యాన్ బ్రౌన్‌కు మాత్రం వలస విధానాలే ప్రధాన ఎన్నికల అంశంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న వలసదారులపై కఠిన చర్యల కారణంగా తన విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. తన విద్యార్థుల్లో ఒకరిని కేవలం 48 గంటల్లోనే మెక్సికోకు బహిష్కరించారని వెల్లడించారు. మరికొందరు విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారని, పాఠశాలకు వెళ్లడం, ఉద్యోగాలకు వెళ్లడం ప్రమాదకరంగా భావిస్తున్నారని తెలిపారు. వారి ఇళ్లకు సురక్షితంగా చేరేందుకు మార్గాలు వెతకాలని తనను విద్యార్థులు కోరిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అయితే తాను ఎవరికి ఓటు వేశాననే విషయాన్ని వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

అలాస్కా రాష్ట్రంలో సెనేట్ ఎన్నికలు మరో ఆసక్తికరమైన అంశంతో వార్తల్లో నిలిచాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రస్తుత సెనేటర్ డాన్ సుల్లివన్‌తో పాటు అదే పేరుతో మరో అభ్యర్థి కూడా బ్యాలెట్‌లో ఉండటంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందనే చర్చ జరిగింది. డెమొక్రటిక్ పార్టీ తరఫున మాజీ ప్రతినిధుల సభ సభ్యురాలు మేరీ పెల్టోలా ఆయనకు పోటీగా నిలిచారు. ఈ ఎన్నికల ఫలితం సెనేట్‌పై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందనే విషయంలో కీలకంగా మారవచ్చని భావిస్తున్నారు.

అలాస్కాలోని యాంకరేజ్‌లో పెరిగి, ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్న 27 ఏళ్ల వైమానిక దళ సభ్యుడు జేక్ వెస్లీ మాట్లాడుతూ, ప్రస్తుత సెనేటర్ పై వ్యతిరేకత ఉందని స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు బాగానే ఉన్నాయని భావించి డాన్ సుల్లివన్ తిరిగి ఎన్నిక కావాలని ఓటు వేసినట్లు తెలిపారు.

దక్షిణ అలాస్కాలోని కాసిలోఫ్‌కు చెందిన 45 ఏళ్ల జూడీ ఫిషర్ కూడా ప్రస్తుత సెనేటర్‌కే ఓటు వేసినట్లు చెప్పారు. అయితే ఒకే పేరుతో మరో అభ్యర్థి ఉండటం వల్ల కొందరి ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు అభ్యర్థుల వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు.

వలస కార్మికులదే  ప్రధాన సమస్య

టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌ కు చెందిన 40 ఏళ్ల మరియా సెర్డా మాట్లాడుతూ, తనతో కలిసి పనిచేసే పలువురు కార్మికులను వలస అధికారులైన ఐసీఈ అధికారులు అదుపులోకి తీసుకున్నారని, కొందరిని దేశం నుంచి బహిష్కరించడంతో కుటుంబాలు విడిపోయాయని చెప్పారు. నిత్యావసర సరుకులు, పెట్రోల్ ధరలు కూడా సామాన్యులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని తెలిపారు. హిస్పానిక్ వర్గాలకు చెందిన ప్రజలపై ఐసీఈ చేపడుతున్న చర్యల పట్ల తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.

వంటవాడిగా పనిచేస్తున్న 54 ఏళ్ల విక్టర్ గార్సియా మాత్రం ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాలకు మద్దతుగా తన ఓటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ విధానాలను అమలు చేస్తున్న తీరు అత్యంత ముఖ్యమని, చర్యలు ఎలా చేపడుతున్నారన్నదే తనకు ప్రధాన అంశమని చెప్పారు.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆర్థిక పరిస్థితులు, వైద్య ఖర్చులు, వలసదారుల సమస్యలు, సామాజిక భద్రత, అభ్యర్థుల రాజకీయ వైఖరులు ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నట్లు ఈ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి. ఒకవైపు ట్రంప్ ప్రభుత్వ వలస విధానాలపై ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆ విధానాలకు మద్దతు పలికే ఓటర్లు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌పై ఎవరి పట్టు కొనసాగుతుందనే విషయంతో పాటు, ఈ ఎన్నికలు అమెరికా రాజకీయాల్లో ప్రజల ప్రాధాన్యతలను కూడా ప్రతిబింబిస్తున్నాయి.

Related posts

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News

తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండ

Satyam News

వైమానిక సంస్థను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Satyam News

నిర్మాణ రంగా అభివృద్ధికి నైపుణ్యంతో కూడిన కార్మిక శక్తి

Satyam News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

బర్కత్ పుర పీఎఫ్ కార్యాలయంలో ఘనంగా బోనాలు పండుగ

Satyam News

Leave a Comment