సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంతి భూషణ్ పై పోలీసు కేసు నమోదు అయింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశాన్ని విమర్శించినట్లుగా రూపొందించిన నకిలీ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన షేర్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఢిల్లీ పోలీసుల సైబర్ పెట్రోలింగ్ సందర్భంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. @thequotesnews అనే సామాజిక మాధ్యమ ఖాతాలో వచ్చిన ఒక పోస్టును పోలీసులు గుర్తించారు. ప్రశాంత్ భూషణ్‌కు చెందిన @pbhushan1 అనే ఎక్స్ ఖాతా నుంచి లావ్రోవ్‌కు సంబంధించిన మార్పులు చేసిన వీడియోను షేర్ చేసినట్లు ఆ పోస్టులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ వీడియోలో చిత్రీకరించారు. ముఖ్యంగా భారతదేశ అంతర్గత వ్యవహారాలు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ఆయన విమర్శలు చేసినట్లు వీడియోలో చూపించారు. అయితే ఈ వీడియో వాస్తవమైనది కాదని, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి మార్పులు చేసిన నకిలీ వీడియో అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
దేశానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపించే వ్యాఖ్యలతో కూడిన తప్పుడు వీడియోల ప్రచారం ఆందోళనకరమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు, పరువునష్టం కలిగించే, రెచ్చగొట్టే సమాచారంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడటమే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. వదంతులు వ్యాప్తి చెందకుండా, ప్రజల్లో అశాంతి నెలకొనకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారతదేశంపై విమర్శలు చేసినట్లు ప్రచారంలో ఉన్న వీడియో పూర్తిగా కల్పితమని విదేశాంగ శాఖ వాస్తవ నిర్ధారణ విభాగం వెల్లడించింది. రష్యా రాయబార కార్యాలయం కూడా ఈ వీడియోలోని వ్యాఖ్యలను ఖండించింది. దీంతో ఈ వీడియో నకిలీదన్న విషయం మరింత స్పష్టమైంది.
