ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయితీల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి విజయ దుందుభి మోగించింది. ప్రత్యక్ష పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ఆధారంగా జరిగిన ఈ ఎన్నికలలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
పులివెందుల మునిసిపాలిటీ, కడప మునిసిపల్ కార్పొరేషన్ సహా అన్ని చోట్లా తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే చురుకుగా సాగుతున్నది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి.
వీటిల్లో అత్యధిక చోట్ల కూటమి హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు తమ సత్తా చాటుతున్నాయి. పలు కార్పొరేషన్లలో ‘కూటమి’ మేయర్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజలో ఉన్నారు. విశాఖపట్నంలో ముక్కా శ్రావణి (టీడీపీ), విజయనగరంలో అవనాపు భార్గవి (టీడీపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక చిత్తూరులో కటారి హేమలత (టీడీపీ), తిరుపతిలో జేబీ శ్రీనివాస్ (టీడీపీ) ముందంజలో దూసుకుపోతున్నారు.
ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీ బోణీ చేసింది. మూడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి పి. వెంకటరమణ ఘన విజయం సాధించారు. 191 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఆయనకు 318 ఓట్లు రాగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థికి 127 ఓట్లు వచ్చాయి. పులివెందులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు, జనసేన, బీజేపీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు.
