గుంటూరుహోమ్

ఉద్యోగాల పేరుతో 36 మందికి మోసం

#PoliceHousing

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి ఏడు కోట్లు రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు ధరణి కృష్ణ, పెద్దిరాజు అనే వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ వెల్లడించారు.

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 36 మంది బాధితులు ఉన్నట్లు తన విచారణలో గుర్తించామని, ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కేకే కోరారు.

మంగళగిరి తాడేపల్లి బైపాస్ రోడ్ లో గల ఏపీ పోలీస్ హౌసింగ్ కార్యాలయంలో కేకే నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ధరణికృష్ణ అనే మహిళ తన పేరును ఉపయోగించుకుంటూ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో సంబంధిత వ్యక్తుల ద్వారా వివరాలు సేకరించి, ఆమె పనిచేస్తున్నట్లు చెప్పిన సంస్థ నిర్వాహకులను సంప్రదించి వాస్తవాలను తెలుసుకున్నానన్నారు.

నకిలీ పత్రాలు సృష్టించారు…

సదరు మహిళ సంస్థలో మానవ వనరుల విభాగంలో ఉద్యోగిగా చేరినప్పటికీ కొంతకాలం తర్వాత విధులకు రావడం మానేసినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారని పేర్కొన్నారు. విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయని, రిజర్వ్ బ్యాంకు వద్ద లావాదేవీలు నిలిచిపోయాయని నమ్మిస్తూ నకిలీ ఆన్‌లైన్ నగదు బదిలీ పత్రాలను చూపించినట్లు ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలు ప్రాంతాల్లో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు.

పర్యావరణ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గుర్తింపు కార్డులు, నియామక ఉత్తర్వులు, ప్రభుత్వ ముద్రలతో కూడిన పత్రాలను చూపించి బాధితులను నమ్మించినట్లు వివరించారు. ఏలూరులో 13 మంది, తణుకులో 19 మంది సహా మొత్తం 36 మంది బాధితులు ఉన్నట్లు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో పోలీసు కానిస్టేబుల్‌కు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తామని, లండన్‌లో పనిచేస్తున్న యువకుడికి కూడా పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మరికొందరిని మోసం చేశారన్నారు.

గతంలో కూడా చీటింగ్ కేసులు

పెద్దిరాజుపై గతంలో 2019లో ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైనట్లు, 2021లో ధరణికృష్ణ సహా ముగ్గురిపై ఉద్యోగాల పేరుతో మోసానికి సంబంధించి మరో కేసు నమోదైనట్లు పత్రాలను ప్రస్తావించారు. నిడదవోలులోనూ ఇదే తరహా మోసాలకు సంబంధించి బాధితులు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ శాఖల పత్రాలు ఎలా నకిలీగా తయారయ్యాయి, సంబంధిత శాఖల్లో ఎవరి పాత్ర ఉందనే అంశాలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

తన పేరును ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించిన వెంటనే తాను, రుక్మిణి పోలీసులను ఆశ్రయించి నవంబర్ 11న మంగళగిరి రూరల్  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ధరణికృష్ణ తనకు క్షమాపణ కోరుతూ లేఖ పంపించిందని, ఆడియో, వీడియో ఆధారాలను కూడా పోలీసులకు అందజేసినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేసును సీఐడీకి బదిలీ చేసినట్లు పేర్కొంటూ, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. బాధితులు తమ వద్ద ఉన్న నియామక పత్రాలు, నగదు చెల్లింపుల ఆధారాలు, ఇతర సమాచారాన్ని సీఐడీ అధికారులకు అందజేయాలని సూచించారు.

తనపై, రుక్మిణిపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమను పార్టీ నాయకత్వానికి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తమపై రూ.7 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ప్రచారం చేయడాన్ని ఖండించారు. పార్టీ కోసం ఎనిమిదేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నామని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమని అన్నారు.

రాష్ట్రంలో ఇలాంటి మోసాలకు గురైన వారు ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఇతరులు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News

ఎట్టకేలకు ఈడీ విచారణకు వచ్చిన ‘‘కాపు టైగర్’’

Satyam News

దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ఇండోనేసియా పురస్కారం

Satyam News

జగన్ హత్య కేసులో లొంగిపోయిన తమీమ్

Satyam News

బైక్ పై ముందు ఎస్పి… వెనుక మంత్రి

Satyam News

ట్రంప్ భార్యపై సినిమా: 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Satyam News

Leave a Comment