ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు టైగర్ గా వై ఎస్ జగన్ అభివర్ణించిన అంబటి రాంబాబు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఈడీ పిలిచినా వెళ్లని అంబటి రాంబాబు ఎట్టకేలకు విచారణకు హాజరు అయ్యారు.
మద్యం అక్రమ రవాణా, లావాదేవీలు, మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అక్రమంగా సమకూరినట్లు అనుమానిస్తున్న నిధులు ఎవరెవరికి చేరాయి? వాటి మళ్లింపులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌కుమార్‌ను జూన్ 18న అరెస్టు చేయగా, అనంతరం ఆగస్టు 23న కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసింది. ఇదే కేసులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని, మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని కూడా ఈడీ అరెస్టు చేసింది.
మద్యం వ్యాపారానికి సంబంధించిన నిధుల ప్రవాహం, మధ్యవర్తుల పాత్ర, వివిధ వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి నిధులు చేరిన తీరుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మరికొందరు రాజకీయ నాయకులు, అధికారుల పాత్రపై కూడా ఈడీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
అంబటి రాంబాబును విచారణకు పిలవడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన నుంచి సేకరించే సమాచారం ఆధారంగా మద్యం కుంభకోణంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్టయిన వ్యక్తులకు, ఇతర అనుమానితులకు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
