డీలిమిటేషన్ బిల్లులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తి కలిగిస్తున్నది. ఇది నేరుగా పాకిస్తాన్ ను సవాల్ చేసేదిగా ఉన్నది. ఈ నెల 30న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ప్రస్తావనను చేర్చడం ద్వారా భారత్ కీలక రాజకీయ, భౌగోళిక సందేశాన్ని ఇచ్చింది.
పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూకశ్మీర్ ప్రాంతం తిరిగి భారత్ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించేలా బిల్లులో నిబంధన పొందుపరిచారు. పాకిస్థాన్ ఆక్రమణ ముగిసిన తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన బాధ్యతలను భారత ఎన్నికల సంఘం డీలిమిటేషన్ కమిషన్‌గా వ్యవహరిస్తూ నిర్వహిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు.
ఈ బిల్లుతో పాటు రాజ్యాంగ 132వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు–2026లకు కూడా శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా పీఓకే ప్రస్తావనను చట్టపరమైన నిబంధనలో చేర్చడం ఈ బిల్లులో కీలక అంశంగా మారింది.
2026 డీలిమిటేషన్ (రెండో సవరణ) బిల్లులో ఈ అంశాన్ని చేర్చారు. పీఓకే ప్రాంతాన్ని కూడా జమ్మూకాశ్మీర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా పరిగణిస్తూ, భవిష్యత్తులో అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియకు మార్గం కల్పించే ఉద్దేశంతో ఈ నిబంధన రూపొందించినట్లు తెలుస్తోంది.
