విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. 2026 జనవరిలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ అమ్మకాలు రికార్డులు సృష్టించాయి. ఒక్క నెలలో 4 లక్షల 30 వేల టన్నుల స్టీల్ విక్రయాలతో 2 వేల 278 కోట్ల ఆదాయం సంపాదించింది. ఈ నెలలో మొత్తం 2 వేల 668 కోట్ల రెవెన్యూ వచ్చింది. పాత బకాయిలు వసూలు కావడంతో.. అమ్మకాల కంటే రెవెన్యూ ఎక్కువగా లభించింది. రెండేళ్ల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని విక్రయించాలనే ఆలోచనలో ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఉక్కు కర్మాగారంతో రాష్ట్ర ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ని దృష్టిలో పెట్టుకొని స్లీట్ ప్లాంట్‌ని నిలబెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి భారీ ప్యాకేజీ సాధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహకారం అందించడం ద్వారా.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సుమారు 15 వేల కోట్ల రూపాయలు ఇప్పించారు. 2024 సెప్టెంబర్‌లో స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్ధ్యంలో కేవలం 25 శాతం కేపాసిటీతో నడిచే పరిస్థితి ఉండేది. 2025 డిసెంబర్ నాటికి ఇక్కడ వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్ మొత్తం మారిపోయింది. ప్లాంట్ ఫుల్ కెపాసిటీ 20 వేల టన్నులయితే.. డిసెంబర్‌లో అంతకు మించి 21 వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి కొత్త రికార్డు సృష్టించారు. వంద శాతానికి మించి ఉత్పత్తి చేయడంతో.. అమ్మకాలు కూడా పెరిగాయి.
ప్రభుత్వ ప్రోత్సాహం, యాజమాన్యం ప్రణాళిక, కార్మికుల సహకారంతో నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌ని లాభాల బాట పట్టించగలిగారు. కరోనా తర్వాత బొగ్గు కొరత.. ఇనుప ఖనిజం లభ్యతలో సమస్యల కారణంగా ఒక దశలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 25 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఇంత భారీ నష్టాలను భరించడం కంటే.. ప్రైవేటీకరణే ఉత్తమం అని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పట్టుబట్టి.. కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి పునరుజ్జీవం కల్పించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఇదే విధంగా పూర్తి సామర్ధ్యంతో పని చేస్తే.. గత నష్టాలను కూడా పూడ్చుకొనే అవకాశం ఉంటుంది.
