శ్రీకాకుళంహోమ్

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

#Udhanam

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్త‌య్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్ ను  ఏర్పాటు చేశారు. ఉద్దాన ప్రాంత వాసుల నుంచి వ్యాధుల రాక‌కు కార‌ణాల‌పై రక్త నమూనాలను సేకరిస్తున్నారు.

కిడ్నీ వ్యాధుల బారినపడే అవకాశం ఉన్న వారిని ముందుగానే గుర్తించేలా మూత్ర నమూనాల పరీక్షలో ‘బయో మార్కర్స్’ విధానాన్ని ఈ సారి కొత్తగా అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నావళి ద్వారా స్థానికుల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఇప్పటివరకు ఉద్దాన ప్రాంతంలో తీసుకున్న చర్యల గురించి పరిశోధన బృందం సభ్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్యకుమార్ మాట్లాడుతూ పరిశోధన చురుగ్గా నిర్వహించాలని, ఉద్దాన బాధితుల్లో సాంత్వన చేకూరేలా చర్యలుండాలని సభ్యులకు స్పష్టం చేశారు.

గత వైకాపా ప్ర‌భుత్వం నిర్వాకంతో ప‌రిశోధ‌న‌కు ఆటంకం

గత తెదేపా ప్రభుత్వ (2014-19) హయాంలో ఆస్ట్రేలియాకు చెందిన‌ జార్జ్ ఇన్స్టిట్యూట్‌కు పరిశోధన బాధ్యతల్ని అప్పగించింది. వ్యాధుల రాక‌కు కార‌ణాల‌పై ప్రారంభ‌మైన ప‌రిశోధ‌న  గత వైకాపా ప్రభుత్వ నిర్వాకంవల్ల  కొన‌సాగ‌లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పరిశోధనలో కదలిక వచ్చింది.

మంత్రి చొర‌వ‌తో ఐసీఎంఆర్ ఆమోదం

ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్నందున‌ వాటి మూలాలు కనుగొనేందుకు గ‌తేడాది నవంబరులో ఇండియన్ కౌన్సెల్ అఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్-డిపార్టుమెంట్‌ అఫ్ హెల్త్ రీసెర్చ్‌ విభాగం) మూడేళ్ల కాలపరిమితితో ప్రత్యేకంగా రూ.6.2 కోట్లను గ్రాంటు రూపంలో ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ చొర‌వ మేర‌కు ఐసిఎంఆర్ సానుకూలంగా స్పందించింది.

సీనియర్ నెఫ్రాలజిస్ట్  ప్రొఫెసర్ తాత‌పూడి రవిరాజు మెంటార్‌గా అంధ్ర వైద్య కళాశాల నెఫ్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రసాద్ ప్రిన్సిపల్ ఇన్విస్టిగేట‌ర్‌గా పరిశోధన ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా ఏర్పడిన బృందం ఉద్దాన ప్రాంత స్థానికులను కలుసుకుంటోంది. ఇప్పటివరకు సుమారు 1,500 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. వీటిని పలాసలోని కిడ్నీ రీసెర్చ్‌ కేంద్రంలో తొలుత భద్రపరిచి, ఆ తర్వాత తగిన జాగ్రత్తలతో కేజీహెచ్ లో ఉన్న ల్యాబ్ కు తరలిస్తున్నారు.

ల్యాబ్ లో అత్యాధునిక పరికరాలు/యంత్రాలు

ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన మేరకు విశాఖ కేజీహెచ్ లో  సెంట్రిప్యూజ్ లు,  డీప్ ఫ్రీజర్లు, శాంపిల్ స్టోరేజీ సిస్టమ్స్, అనలిటకల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఫీల్డ్ శాంపిలింగ్ కిట్లు ఈ ల్యాబ్ లు ఉన్నాయి. సుమారు రూ.80 లక్షలతో కొనుగోలుచేసిన అత్యాధునిక పరికరాలు/ యంత్రాలను బయో సేఫ్టీ ప్రమాణాలకు ల్యాబ్ లో ఏర్పాట‌య్యాయి.

కిడ్నీ వ్యాధుల తీవ్రతపై అంచనా

బయో మార్కర్స్ టెస్టింగ్ ద్వారా కిడ్నీ బాధితులను ప్రాథమిక దశలోనే అతి త్వరగా గుర్తించేందుకు వీలుందని మెంటార్ డాక్టర్ రవిరాజ్, ప్రిన్సిపల్ ఇన్విస్టిగేటర్ డాక్టర్ జి. ప్రసాద్ వెల్లడించారు. మూత్ర నమూనాలను ‘బయో మార్కర్ విధానంలో పరీక్షించడంవల్ల  రానున్న మూడు, నాలుగు సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధుల బారినపడేందుకు అవకాశం ఉన్నట్లయితే సూక్ష్మ స్థాయిలో తెలిసిపోతుందని వివరించారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మూకుమ్మడిగా ఇటువంటి పరీక్షలు చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. మూత్ర నమూనాల సేకరణలో బాధితుల కుటుంబ నేపథ్యం, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ ఈ పరీక్షల ద్వారా రానున్న మూడు, నాలుగేళ్లలో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? లేదా? వస్తే ఏ స్థాయిలో వచ్చేందుకు అవకాశాలున్నాయి? అన్న వాటిపై స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.

ఈ ఫలితాల ఆధారంగా రోగులు తగిన జాగ్రత్తలతో వ్యవహరించేందుకు, వైద్యాన్ని అందించేందుకు సులువవుతుందని తెలిపారు. దీనివల్ల వ్యాధి ముదరకుండా… కిడ్నీలు చెడిపోకుండా ఉండేందుకు వీలుంది. ఆర్ఎన్పీ సీక్వెన్సింగ్‌ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. నిర్ణీత‌ కాల వ్యవధిలోనే పరిశోధన పూర్తిచేసేందుకు వీలుగా నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని వారు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వివరించారు.

Related posts

‘లూయిస్ వ్యూట్టన్’లో రాజ్ దాసిరెడ్డి సందడి

Satyam News

అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేరళ

Satyam News

రైతు భరోసా నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు

Satyam News

లోకేశ్‌ రెడ్‌ బుక్‌…. పవన్‌ యోగీ ట్రీట్‌మెంట్‌…. వైసీపీకి మూడింది..!

Satyam News

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌పై దాడి దుర‌దృష్ట‌క‌రం

Satyam News

మోడీ ప్రవర్తన తీరు దేశానికి అవమానకరం

Satyam News

Leave a Comment