ముఖ్యంశాలుహోమ్

అర్హతలేని వారికి రవాణా కాంట్రాక్టులు

#Niranjanreddy

అర్హతలేని రవాణా సంస్థలకు ఒప్పందాలు కట్టబెట్టడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయిందని, రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలిపారు.

రైతులు నెలల తరబడి శ్రమించి పండించిన వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం పేరుకుపోయి వర్షాలకు తడిసి నష్టపోయిందని పేర్కొన్నారు. రైతులు యూరియా కోసం రోజులు తరబడి క్యూల్లో నిలబడాల్సి వచ్చిందని, మరోవైపు ముఖ్యమంత్రి మొత్తం ధాన్యం కొనుగోలు చేశామని బాధ్యతారహిత ప్రకటనలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు.

తమ పాలనలో ప్రతి గింజా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రవాణా ఒప్పందాల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. లారీలు, ట్రక్కులు కూడా లేని వారికి రవాణా సంస్థల బాధ్యతలు అప్పగించారని, ఒకే సంస్థకు అనేక ప్రాంతాల్లో అవకాశాలు కల్పించారని తెలిపారు. కేసులు ఎదుర్కొంటున్న మిల్లర్లకు కూడా రవాణా బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. కొందరు మిల్లర్లు మంత్రుల అనుచరులుగా వ్యవహరిస్తున్నారని, ఒక మిల్లర్ మంత్రి కుమారుడికి ఖరీదైన వాహనం బహుమతిగా ఇచ్చాడని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో 57 మిల్లులపై తనిఖీలు నిర్వహించినప్పటికీ కేవలం 34 మిల్లుల యాజమాన్యాలపై మాత్రమే చర్యలు తీసుకున్నారని, అధికార పార్టీకి చెందిన మిగిలిన మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పక్షపాత ధోరణితో కేసులు ఉన్న మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు జరిగాయని విమర్శించారు.

సివిల్ సరఫరాల శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, అర్హతలేని రవాణా సంస్థలపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి తరుగు, తాళ్లు పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, దీనిపై కూడా పోరాటం చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగిందని, కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ రైతులను గాలికి వదిలేసిన చరిత్ర ప్రస్తుత ప్రభుత్వానిదేనని విమర్శించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు.

అనంతరం మార్కెట్ యార్డును సందర్శించిన నిరంజన్ రెడ్డి, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించారు. రైతుల ఆవేదన విన్న ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నోటికాడికి వచ్చిన పంట ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీటిపాలైందని, తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Satyam News

జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లు ఎటువైపు?

Satyam News

హెరిటేజ్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

ప్రాణాలు పోతున్నా వడ్ల రైతుల్ని పట్టించుకోవడం లేదు

Satyam News

ప్రధాని మోడీ ఈ సారి ప్రత్యేక తలపాగా….

Satyam News

Leave a Comment