గుంటూరు హోమ్

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

#Pinnelli

మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ నేతల జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటీషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. లొంగిపోవడానికి కొంత సమయం కావాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు లాయర్లు కోర్టును కోరారు.

దీంతో సరెండర్ అయ్యేందుకు రెండు వారాల సమయాన్ని న్యాయస్థానం ఇచ్చింది. పల్నాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక మధ్యంతర రక్షణ రద్దు అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా రద్దు చేశారు.

పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరుల మందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు గతంలో కొట్టివేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకట్రావు, ఏ3గా తోట గురవయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5 గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నిందితులుగా చేర్చారు. హైకోర్టు తీర్పును పిన్నెల్లి సోదరులు సుప్రీంలో సవాలు చేశారు.

అయితే వారిద్దరికీ మధ్యంతర రక్షణ కల్పించిన సుప్రీం ధర్మాసం పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటీషన్‌పై తుది నిర్ణయం వెలువరించేంత వరకు వారిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలను జారీ చేసింది. తాజాగా పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు మధ్యంతర రక్షణ ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినా సహకరించలేదని, సాక్షులను బెదిరించారని, సాక్ష్యాలు ట్యాంపర్‌ చేసే ప్రయత్నం చేశారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఇద్దరిని చంపిన వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ పొందేందుకు పిన్నెల్లి సోదరులకు ఏమాత్రం అర్హత లేదని జస్టిస్‌ సందీప్‌ మెహతా వ్యాఖ్యానించారు. వెంటనే అరెస్టు చేయడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే లొంగిపోవడానికి రెండు వారాలు సమయం ఇవ్వాలని పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు కోరారు.

ముందస్తు బెయిల్‌ విషయంలో లొంగిపోయేందుకు సమయం ఎలా ఇస్తారని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు. సెక్షన్‌ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్లు నిందితులకు ఎలా అందాయని ప్రభుత్వాన్ని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు. నిందితుల 161 స్టేట్‌మెంట్‌ను పోలీసులు నిందితులకే ఎలా ఇస్తారని జస్టిస్ నిలదీశారు.

పోలీసులు కూడా నిందితులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అవసరం అవుతుందేమోనని కూడా జస్టిస్ సందీప్ మెహతా అన్నారు. 161 స్టేట్‌మెంట్ కూడా తమకు అనుకూలంగా ఉందని, పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తున్నారని సుప్రీంకు పిన్నెల్లి సోదరుల తరపు న్యాయవాదులు తెలిపారు.

Related posts

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య

Satyam News

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

Leave a Comment

error: Content is protected !!