రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు (ATS) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసన మండలిలో రవాణా శాఖకు సంబంధించిన అంశాలపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో వాహనాల తనిఖీ విధానాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ల కోసం 30-09-2024న ట్రాన్స్‌పోర్ట్ & రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ జి.ఓ నం.28 ద్వారా పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ATSల ఏర్పాటు ప్రక్రియ తుది దశలో ఉందని, ఇవి పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగానికి ఎటువంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు.
ఈ స్టేషన్లను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 15, రెండవ దశలో 22 కేంద్రాలు ప్రారంభించనున్నారు. భూసేకరణ ప్రక్రియను బట్టి వీటి అమలు జరుగుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాత వాహనాలపై గ్రీన్ టాక్స్ ద్వారా రూ.68.11 కోట్లు, 2025-26లో రూ.71.14 కోట్లు ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ నిధులను శాఖ వినియోగిస్తున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలకు 100 శాతం పన్ను మినహాయింపులు అందిస్తున్నామని తెలిపారు.
వాహనాల స్క్రాపేజీ పాలసీని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ప్రస్తుతం మూడు రిజిస్టర్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు. పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి ప్రజలను ప్రోత్సహించేందుకు లయబిలిటీల మాఫీ, పన్ను రాయితీలు కూడా ఇస్తున్నామని వివరించారు. రవాణా శాఖలో పారదర్శకత పెంచేందుకు ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ వ్యవస్థను తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో నూతన సాంకేతికతను వినియోగించి అవినీతి, లోపాలను తగ్గించనున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వ కాలంలో వాహన్–సారథి వ్యవస్థలో రాష్ట్రం చేరలేదని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సారథి పోర్టల్‌లో చేరినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి వాహన్ సేవల్లో కూడా రాష్ట్రం భాగస్వామ్యం కానుందని చెప్పారు. మాన్యువల్ టెస్టింగ్, NOCల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర అనుమతులు పొందినట్లు వెల్లడించారు.
ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు షోరూమ్‌లలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. అలాగే TS స్థానంలో TG రిజిస్ట్రేషన్‌ను ప్రవేశపెట్టి, రవాణా శాఖకు కొత్త లోగోను కూడా తీసుకొచ్చామని పేర్కొన్నారు.
రోడ్డు భద్రతపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. డ్రైవర్లకు విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి నియామకాలు చేస్తున్నామని చెప్పారు.
అదనంగా, నగర ప్రవేశ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు స్థలాలు కేటాయిస్తే రవాణా శాఖ ద్వారా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. మొత్తంగా రవాణా శాఖలో గతంలో లేని విధంగా దాదాపు 50కి పైగా సంస్కరణలు అమలు చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
