భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించిన వృద్ధిరేటు సాధిస్తున్నది. 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో నమోదైన 5.6 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ.
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో సాధించిన 7.8 శాతం వృద్ధిని కూడా అధిగమించింది. అంచనాలను తలకిందులు చేస్తూ ఈ వృద్ధి ప్రధానంగా సేవల రంగం, తయారీ రంగం ప్రాభవంతో సాధ్యమైందని ప్రభుత్వం తెలిపింది. సేవల రంగం 9.2 శాతం, తయారీ రంగం 9.1 శాతం వృద్ధిని సాధించాయి.
తయారీదారుల స్థాయిలోనూ, వినియోగదారుల స్థాయిలోనూ ద్రవ్యోల్బణం తగ్గడం ఆర్థిక వేగానికి అనుకూల వాతావరణాన్ని కల్పించిందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. ప్రస్తుత ధోరణులు కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తుందని ఆయన అంచనావేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వృద్ధి ప్రభుత్వ ప్రగతికేంద్రిత విధానాల ప్రభావమని అభిప్రాయపడ్డారు. “2025–26 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో నమోదైన 8.2 శాతం జిడిపి వృద్ధి చాలా ఉత్సాహవంతమైనది. ఇది మా సంస్కరణలు, ప్రొ గ్రోత్ విధానాల ఫలితం.
అలాగే దేశ ప్రజల శ్రమ, పారిశ్రామికోత్సాహానికి నిదర్శనం. జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ప్రధాని చెప్పారు. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, స్థిర ధరలపై 2025–26 రెండో త్రైమాసికంలో రియల్ జిడిపి ₹48.63 లక్షల కోట్లుగా నమోదైంది.
ఇది గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో ఉన్న ₹44.94 లక్షల కోట్లతో పోలిస్తే 8.2 శాతం అధికం. ప్రస్తుత ధరలపై జిడిపి విలువ ₹85.25 లక్షల కోట్లుగా ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో అది ₹78.40 లక్షల కోట్లు. ఈ గణాంకాలు 8.7 శాతం నామమాత్ర వృద్ధిని సూచిస్తున్నాయి.
సెకండరీ రంగం 8.1 శాతం, తృతీయ రంగం 9.2 శాతం వృద్ధిని సాధించడంతో రియల్ జిడిపి మొత్తం వృద్ధి రేటు 8 శాతం దాటింది. తయారీ రంగం 9.1 శాతం, నిర్మాణ రంగం 7.2 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవల రంగం 10.2 శాతం వృద్ధితో టర్టియరీ రంగాన్ని మరింత బలపరిచింది.
వ్యవసాయం, అనుబంధ రంగాలు 3.5 శాతం, విద్యుత్–గ్యాస్–నీటి సరఫరా రంగం 4.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ (PFCE) 2025–26 రెండో త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి సాధించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో PFCE వృద్ధి రేటు 6.4 శాతం మాత్రమే. స్టీల్, సిమెంట్, వస్త్రాలు, ఆటోమొబైల్స్, టైర్ల వంటి పరిశ్రమల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది.
రిజర్వ్ బ్యాంక్ చేసిన రెపో రేటు సవరణలు, జీఎస్టీ సరళీకరణలు కూడా వృద్ధికి తోడ్పడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ డిమాండ్ మద్దతుగా నిలబడిందని సీఈఏ తెలిపారు. 2025 అక్టోబర్‌లో దేశంలో ట్రాక్టర్ అమ్మకాలు గత 11 ఏళ్లలో ఏ నెలలోనూ నమోదు కాని అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
అనుకూల వర్షాలు, మెరుగైన పంటలు, గ్రామీణ ఆదాయాల పెరుగుదల, పండుగల సీజన్ డిమాండ్ ఇవి గ్రామీణ వినియోగాన్ని పెంచాయని ఆయన తెలిపారు. అలాగే రెండు, మూడు చక్రాల వాహనాల రిటైల్ అమ్మకాలు కూడా అదే నెలలో అత్యధికంగా నమోదయ్యాయి.
మూడీస్ రేటింగ్స్ భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 7 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఆసియా–పసిఫిక్ దేశాల్లో, ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ ముందంజలో ఉంటుందని పేర్కొంది. 2026లో 6.4 శాతం వృద్ధిని భారత్ సాధిస్తుందని, APAC ప్రాంతం సగటు వృద్ధి 3.4 శాతం ఉంటుందని మూడీస్ వెల్లడించింది.
ఇంటి పొదుపులు పెరగడం కూడా ఆర్థిక స్థిరీకరణకు కారణమని ప్రభుత్వం పేర్కొంది. 2022–23లో జిడిపిలో 5.9 శాతం ఉన్న గృహ ఆర్థిక బాద్యతలు 2024–25లో 4.7 శాతానికి తగ్గాయని తెలిపింది. తయారీ, సేవల రంగాల్లో విస్తరణతో పాటు పండుగల డిమాండ్, జీఎస్టీ తగ్గింపులు వృద్ధి దిశను బలోపేతం చేశాయని సీఈఏ భావన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ మాత్రం ఈ గణాంకాలను ప్రశ్నించారు. ఐఎంఎఫ్ ఇటీవల భారత జాతీయ లెక్కల గణాంకాలకు ‘సి’ గ్రేడ్ ఇచ్చిన నేపథ్యంలో, జిడిపి గణాంకాలు ప్రజల వాస్తవాలతో పొంతనలో లేవని ఆయన వ్యాఖ్యానించారు.
పెట్టుబడుల వృద్ధి లోపిస్తున్నప్పుడు అధిక జిడిపి వృద్ధి లెక్కలు అనారోగ్యకరమని అన్నారు. పారిశ్రామిక వేత్తలు మాత్రం ఈ వృద్ధిని స్వాగతించాయి. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు రాజీవ్ జూనేజా, ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు భారత అభివృద్ధికి పునాది వేసాయని పేర్కొన్నారు.
