హైదరాబాద్హోమ్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు

#Ponguleti

నిషేధిత ఆస్తుల పిఓబి / 22ఎ జాబితాలో ఉన్న భూముల‌కు సంబంధించి ప్రజ‌లు ఎలాంటి అపోహ‌లు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, చ‌ట్టబ‌ద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు.

కొత్తగా ఎలాంటి భూముల‌ను త‌మ ప్రభుత్వం  నిషేధిత జాబితాలో చేర్చలేద‌ని, గ‌త ప్రభుత్వం నుంచి కొన‌సాగుతున్న చ‌ట్టప‌ర‌మైన సాంకేతిక చిక్కుల‌ను ప‌రిష్కరించి బాధితుల‌కు ఊర‌ట క‌లిగిస్తామ‌ని స్పష్టం చేశారు. భూముల రెగ్యుల‌రైజ్‌కు  సంబంధించి ప్రభుత్వం ఇప్పటివ‌ర‌కు జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేక‌ర‌ణ ప్రొసీడింగ్స్,  లే-అవుట్ల అనుమతులు తదితర వివ‌రాల‌తో కూడిన అన్ని డాక్యుమెంట్లను   ఈనెల 14వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

త‌ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చని రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో స‌బ్ రిజిస్ట్రార్‌ల‌కు స్పష్టత వ‌స్తుంద‌ని,  ఏది బోగ‌స్ డాక్యుమెంట్‌, ఏది నిజ‌మైన డాక్యుమెంట్ అనేదానిపై సూప‌ర్ చెక్ చేసుకోవ‌డానికి వీలుక‌లుగుతుందన్నారు. మరింత పారదర్శకత కోసం  పహానీలు కూడా స‌బ్ రిజిస్ట్రార్‌కు ఏక్సెస్ ఉండేలా చ‌ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వచ్చిన ద‌ర‌ఖాస్తుల్లో ఏది జెన్యూన్‌  ఏది కాదు గుర్తించి జెన్యూన్ ఉన్నవాటిని యుద్దప్రాతిప‌దిక‌న ప‌రిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు.  గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా ప్రజా కోణంలో ఆలోచించి కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు మరింత క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.

మంగ‌ళ‌వారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 22ఎ/ పిఓబి అంశంపై  హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి, సంగారెడ్డి క‌లెక్టర్లు, జిల్లా స‌బ్‌రిజిస్ట్రార్లతో మంత్రి గారు సుదీర్ఘంగా చ‌ర్చించారు. 22ఎకు సంబంధించి ప్రజావాణితో పాటు క‌లెక్టర్లు, ఆర్డీవోలు, త‌హ‌శీల్దార్లకు, స‌బ్ రిజిస్ట్రార్లకు జిల్లాల వారీగా వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఎన్ని, వాటి ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై స‌మావేశంలో కూలంక‌షంగా చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ “స‌మ‌స్య వ‌చ్చిన‌పుడు ప‌రిష్కరించేదానిక‌న్నా స‌మ‌స్య రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉంద‌న్నారు.  పిఓబి ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి కేస్‌బై కేస్ ప్రతి రోజూ స‌మీక్షించాలి. 22ఎ పేరిట ఉద్దేశ‌పూర్వకంగా పేదోడికి అర్హుల‌కు అన్యాయం చేసే విధంగా వ్యవ‌హ‌రిస్తే ఊరుకునేదిలేదు.

స‌బ్ రిజిస్ట్రార్లకు విచ‌క్షణాధికారాలు ఉండ‌కూడ‌దని  అద‌న‌పు అధికారాలు వ‌ద్దని ఈ విష‌యంపై గ‌తంలోనే చాలా స్పష్టత ఇచ్చాను. ఆన్‌లైన్‌లో ఏది ఉంటే దానికి ఆమోదం తెలిపేవ‌ర‌కే వారి అధికారాల‌ను ప‌రిమితం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశిస్తున్నాను. ప్రభుత్వ ఆస్తుల‌ను కాపాడే విష‌యంలో ఏమాత్రం రాజీప‌డే ప్రస‌క్తేలేదు. ఏ చిన్న త‌ప్పుచేసినా క్షమించేదిలేదు, క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటాను.

ఏదైనా స‌మ‌స్య ఉంటే జిల్లా స‌బ్ రిజిస్ట్రార్‌లు క‌లెక్టర్ దృష్టికిగాని ఐజీ దృష్టికి గాని తీసుకురావాలి. పిఓబీ జాబితాలో ఉన్న  ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌ల‌ను గుడ్డిగా తిర‌స్కరించ‌కుండా మూడు రోజుల స‌మ‌యం తీసుకొని ఎందుకు తిర‌స్కరించ‌వ‌ల‌సి వ‌స్తుంద‌న్న వివ‌రాల‌ను తెలియ‌జేయాలి.  పిఓబీకి సంబంధించి  వ‌చ్చిన ప్రతి ద‌ర‌ఖాస్తును ఇకనుండి త‌హ‌శీల్దార్‌కు పంప‌కుండా నేరుగా క‌లెక్టర్‌కే పంపించాలి.

కలెక్టర్ నుండి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నుండి కలెక్టర్ మధ్యనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరగాలి, గ‌తంలో నాన్ అగ్రిక‌ల్చర్‌, అగ్రిక‌ల్చర్‌, పీఓబీ జాబితాలు వేర్వేరుగా ఉండేవి. వీటిని స‌మీకృతం చేయ‌డం వ‌ల‌న స‌బ్ రిజిస్ట్రార్ ప‌రిశీల‌న‌లో కొన్ని ఆస్తులు, నిషేధిత జాబితాలో ఉన్నట్లు క‌నిపిస్తున్నందున మొత్తం రిజిస్ట్రేష‌న్  ఆపుతున్నార‌ని ఫిర్యాదుల వ‌స్తున్నాయి.  తాజాగా అప్‌లోడ్ చేస్తున్న స‌మాచారంతో స‌రిపోల్చుకొని నిర్ణయాలు తీసుకోవాలి.

ఈ రోజు సాయంత్రంలోగా నాలుగు జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ లతో సమావేశం నిర్వహించి ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారికి తెలియజేసి తక్షణం అమలుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ ఐ.జి. ని ఆదేశించారు.   ఈ సమావేశంలో రెవెన్యూ సెక్రెటరీ డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐ.జి. రాజీవ్ గాంధీ హనుమంత్, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు.

Related posts

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

సాయుధ హిజ్బుల్లా ఉగ్రవాదుల పై ఇజ్రాయెల్ భీకర దాడి

Satyam News

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

Satyam News

Leave a Comment