జారాల కింద ఉన్న భీమా పేజ్ 1,2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్టులతో పాటు, జూరాల కాలువలు, కేఎల్ఐ కింద ఉన్న మూడు పంపులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, బీరం హర్షవర్దన్ రెడ్డి శుక్రవారంనాడు మాట్లాడారు.
ఈ నెల 11 వరకు డెడ్ లైన్ విధిస్తున్నాం. అప్పటిలోగా ప్రారంభించకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్ ముట్టడిస్తాం. అక్కడ రైతులు, ప్రజలతో కలిసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని వారన్నారు.
పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు వచ్చినా పనులు కొన సాగకుండా సాగునీటి సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నుండి ఎన్వోసీ అంటూ మెలికపెట్టారని, తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులను వినియోగించుకోకుండా చట్టపరమైన చిక్కులు వచ్చేలా ఆస్కారం ఇస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.
ఎల్ నినో ప్రభావం ఉన్నా క్రిష్ణా నదికి ఎగువన కురిసిన వర్షాల వల్ల ఆశాజనకమైన ప్రవాహం వస్తున్నది. జూరాల నుండి 2.30 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వెళ్తుంది. శ్రీశైలంలో 160 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వారం రోజులు ఇదే ప్రవాహం కొనసాగితే శ్రీశైలం నిండుతుంది. క్రిష్ణాలో అసలు నీటి ప్రవాహం లేనట్లు నాగార్జున సాగర్ వద్ద వరుణయాగం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. శ్రీశైలంలో 160 టీఎంసీలు ఉంటే 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి అని ఎలా నివేదిక ఇస్తారు? నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఆంధ్రా అధికారులు ఉన్నారు. నీటి పారుదల సలహాదారును చంద్రబాబు తెలంగాణకు దత్తత పంపించారు. బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నా సాగునీళ్లు ఇవ్వకుండా ఎలా సాకులు చెప్పాలో ఈ కాంగ్రెస్ సర్కారులోని అధికారులు ఉన్నారు.
అనుకూల మీడియాలో వార్తలు ప్రచారం చేస్తూ సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను మభ్యపెట్టాలని చూస్తున్నారు. పాలమూరుకు నీళ్లు ఇవ్వకపోతే సాగర్ నిండుతుందని మంత్రి ఉత్తమ్ ఎలా భావిస్తారు ? మధ్యలో ఏపీ ఆంధ్రాకు తరలించదా ? రేవంత్ మీద కోపంతో ఉత్తమ్ ఇలా చేస్తున్నారా ? లేక పాలమూరుకు నీళ్లు ఇవ్వకుండా ఏపీకి నీళ్లు తరలించేందుకు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నాడా? అని వారు ప్రశ్నించారు.
