ఒడిశా నుంచి తెలంగాణకు జరుగుతున్న హ్యాషిష్ ఆయిల్ అక్రమ రవాణా గుట్టును ఎల్‌బీ నగర్ ఎస్‌ఓటీ, నాగోల్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 14.2 కిలోల హ్యాషిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.75 కోట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, యమహా MT-15 బైక్, రూ.2,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ఇద్దరు నిందితులు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన తల్లే నాగరాజు (30), నాగుల నారాయణ అలియాస్ కిరణ్ (39)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ పెడ్లర్లు కమ్ ట్రాన్స్‌పోర్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. గతంలోనూ వీరిపై గంజాయి కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నాగరాజు గతంలో 10 కిలోల గంజాయి కేసులో నిందితుడిగా ఉండగా, నాగుల నారాయణ 140 కిలోల గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 21న గౌరెల్లి ఎక్స్‌రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బైక్‌పై హైదరాబాద్ వైపు వస్తున్న ఇద్దరిని పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను తనిఖీ చేయగా 14 ప్యాకెట్లలో మొత్తం 14.2 కిలోల హ్యాషిష్ ఆయిల్ గుర్తించారు. వెంటనే డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
విచారణలో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన తమరా గోపాల్ అనే వ్యక్తి తమకు హ్యాషిష్ ఆయిల్ సరఫరా చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరికి 7 కిలోల చొప్పున మొత్తం 14 కిలోల హ్యాషిష్ ఆయిల్‌ను హైదరాబాద్‌కు తరలించాలని గోపాల్ తమకు అప్పగించినట్లు వారు చెప్పినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు చేర్చినందుకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెల్లిస్తానని గోపాల్ ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ చేరుకున్న తర్వాత డ్రగ్స్ ఎక్కడ, ఎవరికి డెలివరీ చేయాలో వివరాలు చెబుతానని గోపాల్ చెప్పినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రధాన సరఫరాదారు తమరా గోపాల్ పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనపై నాగోల్ పోలీస్ స్టేషన్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న నెట్‌వర్క్, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి పర్యవేక్షణలో ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను అడ్డుకోవడంతో పాటు డ్రగ్ పెడ్లర్లు, వినియోగదారులను గుర్తించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని పోలీసులు కోరారు.
