హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే విషయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి.శ్రీధర్ బాబు సానుకూలంగా వ్యవహరిస్తుండడం పట్ల హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (HJHSJAC) కృతఙ్ఞతలు తెలిపింది.
గురువారం బషీర్ బాగ్ లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో JAC బాధ్యులు హాజరై, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు అన్నీ హౌసింగ్ సొసైటీలు ఏకంచేసి జేఏసీ గా ఏర్పాటు చేశామని, అలాగే మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డి తో పలు దఫాలు సమావేశమై, ఆయా జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సమగ్ర సమాచారాన్ని వారికి అందించినట్లు జేఏసీ బాధ్యులు తెలిపారు.
అయితే ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. మరోమారు ముఖ్యమంత్రిని, సమాచార శాఖ మంత్రిని కలిసి ఈ ప్రక్రియపై అభ్యర్థించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో జేఏసీ బాధ్యులు కె. విరాహత్ అలీ, ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, మురళీ క్రిష్ణ, గోపరాజు, రవీంద్ర బాబు, రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు.
