వైసీపీ హయాంలో తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కేవలం రాజకీయ ఆర్భాటాలకే పరిమితమైంది. లక్షకు పైగా ఉద్యోగాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పిన నాటి జగన్ సర్కార్, ఐదేళ్ల పాలనలో ఆ ఉద్యోగుల పట్ల కనీస చిత్తశుద్ధి చూపలేదు. 1.26 లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నప్పటికీ, నియామకాలు, విధులు, సర్వీస్ రూల్స్ అన్నీ గందరగోళంగా మార్చి ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది.
డిగ్రీ అర్హతతో APPSC ద్వారా ఎంపికైన ఉద్యోగులను వలంటీర్ల కనుసన్నల్లో పనిచేసే దుస్థితికి నెట్టింది. సరైన పదోన్నతి ఛానెల్ లేకపోవడంతో, చేరిన ఉద్యోగి అదే హోదాలో రిటైర్ అయ్యేలా విధానాలను అమలు చేసింది. ప్రొబేషన్ డిక్లరేషన్‌లోనూ ఇబ్బందులు పెట్టి, చివరికి విసిగిపోయి దాదాపు 12 వేల మంది ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్తే..వారు తీసుకున్న గౌరవ వేతనాన్ని కూడా వెనక్కి వసూలు చేసిన ఘనత నాటి జగన్ ప్రభుత్వానిది.
తాజాగా సచివాలయ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ చేపట్టిన నేపథ్యంలో, జగన్ మోహన్ రెడ్డి వారి పట్ల మొసలి కన్నీరు కార్చుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఉద్యోగులను పట్టించుకోకుండా, వారిని నవరత్నాల అమలుకూ, వైసీపీ కార్యకర్తలైన వలంటీర్ల ఆదేశాలకు బానిసలుగా మార్చిన నేత..ఇప్పుడు హఠాత్తుగా వారి సంక్షేమం గురించి మాట్లాడటాన్ని ఆ ఉద్యోగులే ఎద్దేవా చేస్తున్నారు. ఏనాడూ సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా, సొంత పార్టీ కార్యకర్తలతో దాడులు కూడా చేయించిన చరిత్ర కూడా వైసీపీ అధినేతది. అలాంటి వ్యక్తి నేడు ఉద్యోగుల హక్కుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.
మరోవైపు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గందరగోళంగా మారిన సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీరియస్‌గా సంస్కరణలు చేపట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ శాఖను స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు శాఖగా మార్చి, జనాభా ప్రాతిపదికన సిబ్బందిని రేషనలైజ్ చేశారు. జగన్ సర్కార్ గాలికొదిలేసిన సర్వీస్ రూల్స్‌ను రూపొందించడమే కాకుండా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా పదోన్నతి ఛానెళ్లను కల్పించారు. నిలిచిపోయిన ప్రొబేషన్‌లను ఖరారు చేస్తూ జీతాలు పెంచే ప్రక్రియను వేగవంతం చేశారు.
నాడు ఉద్యోగుల భవిష్యత్తును పట్టించుకోకుండా, వారిని రోడ్డున పడేసిన వైసీపీ నేతలు ఇవాళ మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయం చేయాలని చూస్తే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. కష్టకాలంలో ఉసురు పోసుకున్న వైసీపీ నేతల తీరును సచివాలయ సిబ్బంది తీవ్రంగా ఖండిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు గుర్తింపు, సరైన సర్వీస్ రూల్స్ లభిస్తున్నాయని, నాడు తమను మోసం చేసిన వారి అసలు రూపం ఇప్పుడు బయటపడుతోందని ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
