సంపాదకీయంహోమ్

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

#PavanKalyan

తన ఎక్స్ (ట్విటర్టర్ ) ఖాతా నుంచి ఎర్ర చందనం గ్యాంగ్ లపై, వారు సమాజానికి, ప్రకృతికి చేస్తున్న విఘాతం పై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమంపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల ఎర్ర చందనం దుంగలను నిల్వ చేసిన ప్రదేశాలను ఆయన చూసి వచ్చిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత అటవీ ఆక్రమణలను కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యటించి పరీక్షించారు. తాజాగా ఆయన శేషాచలం అడవుల సంరక్షణపై దాదాపుగా ‘‘యుద్ధం’’ ప్రారంభించారు. పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో ‘‘ శేషాచలం అడవులు ఒక సాధారణ అడవి మాత్రమే కాదు.. ఏడు పర్వతాల మహాసౌభాగ్యంతో అనుగ్రహించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర నిలయము.

అలాంటి దైవిక స్థలంలో మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు, మన విశ్వాసానికి, మన పర్యావరణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరం అమానుషమైనది. మనం మాట్లాడేది రెడ్‌ సాండర్స్ చెట్టు‘‘ రక్తచందనం’’ గురించి. ఈ అద్భుతమైన సంపద ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది మనకు ప్రత్యేకమైనది.

మన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొనసాగించే పవిత్ర నిధి. మహాపురాణాలలో ఇది శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య రక్తం నుంచి పుట్టిందని కూడా చెబుతారు! ఈ చెట్టును నరికివేయడం అంటే కేవలం అటవీ నేరం కాదు అది ఆధ్యాత్మిక అవమానం! చెట్లు ప్రాణంలేని దిమ్మెలు కావు.

భారత శాస్త్రవేత్త జగదీశ్ చంద్ర బోస్ గారి పరిశోధనల ద్వారా మనకు తెలిసిందే. చెట్లు బాధను అనుభవిస్తాయి, షాక్‌ను ఫీలవుతాయి. జర్మనీ అటవీ శాస్త్రవేత్త పీటర్ వోల్లెబెన్ చెప్పినట్లుగా అవి ఒక సమూహ జీవితం “వుడ్ వైడ్ వెబ్”లో జీవిస్తాయి. ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, పంచుకుంటాయి, పరిరక్షించుకుంటాయి.

ఒక ‘తల్లి చెట్టు’ను నరికి వేస్తే, ఆ మొత్తం జీవజాలం విద్యుత్ షాక్‌లాంటి వేదనతో కుదేలవుతుంది. నేరగాళ్లు కత్తెర పట్టుకుని నరికింది ఒక చెట్టును కాదు. ఒక జీవించే పవిత్ర సమాజాన్ని చీల్చి పడేస్తున్నారు! వారికి కనిపించేది ఎర్రని ధనం మాత్రమే… కానీ మనకు కనిపించేది కోట్లాది మంది భక్తుల గాయపడిన విశ్వాసం!

మంగళం ఫారెస్టు డిపోలో ఇటీవల జరిగిన గోదాముల పరిశీలన గత కొన్ని సంవత్సరాల దోపిడీకి నిశ్శబ్దమైన సాక్ష్యంగా నిలిచింది. అది ఒక నిశ్శబ్ద సమాధి స్థలం లా అనిపిస్తున్నది. అక్కడ కనిపించినవి 2.6 లక్షల దుంగలు, అంటే 1.3 లక్షల తల్లి చెట్లను నరికి వేసిన అవశేషాలు. ఈ ఆర్థిక దోపిడీ భయంకరమైనది రూ.2,000 కోట్లు… బహుశా రూ.5,000 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా దోచుకున్న డబ్బు! ప్రజల సొమ్ము… రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాల్సిన ధనం!

ఇక్కడ సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి…

ఎలా కొంతమంది ఇంత సులభంగా అటవీ భూముల్లో చొరబడగలుగుతున్నారు?

ఎవరి వీరంగంతో వారు రెడ్ సాండర్స్ చెట్లను నేరుగా నరికి వేయగలుగుతున్నారు?

పోలీసులు, భద్రతా వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సమాజం ఉన్నప్పటికీ వారు ఎలా బరితెగించి స్మగ్లింగ్ చేస్తూ తప్పించుకుంటున్నారు?

సమాధానం స్పష్టంగా ఒకే విషయాన్ని చెబుతుంది… గతంలో వ్యవస్థల వైఫల్యం, రాజకీయ సంకల్పలేమి. ఇకపై ‘ఎందుకు ఇలా జరిగిందో?’ అని అడగడం కాదు. న్యాయం డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది.

ఇకపై ఎవరూ శేషాచలం అడవులను వారి ఇంటి ఆస్తిగా భావించలేరు. ఎవరూ అంతరించిపోతున్న రక్తచందనాన్ని తమ వ్యక్తిగత ఆస్తిగా చూడలేరు.

కూటమి ప్రభుత్వం రెడ్‌ సాండర్స్ స్మగ్లింగ్‌ను ఇక సహించదు. మేము స్మగ్లర్లు, కింగ్‌పిన్లు, పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ గుర్తిస్తున్నాం. అరెస్టులకే పరిమితం కాదు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం!

త్వరలో కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కాగర్’ తరహాలోనే, ఈ మొత్తం అక్రమ నెట్‌వర్క్‌ను నేలమట్టం చేసే ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభం కానుంది. ఇకపై ఒకరూ… ఒక్కరైనా… రెడ్ సాండర్స్ చెట్టుకు కూడా దగ్గరపడాలనే ధైర్యం చేయలేని పరిస్థితి మేము సృష్టిస్తాం. రెడ్ సాండర్స్ ఒక జీవం. అది మన జాతీయ సంపద. అది పవిత్రం. శేషాచల మహాత్మ్యాన్ని, మన దేశ సంపదను రక్షించేందుకు మేము అప్రమత్తంగా ఉన్నాం. మరియు వాటిని కాపాడుతాం!

రెడ్‌ సాండర్స్ అక్రమ రవాణా వల్ల శెషాచలం అడవులు ఎదుర్కొన్న విపరీతమైన విధ్వంసాన్ని బయటపెడుతూ రూపొందించిన డాక్యుమెంటరీ “ప్లానెట్ కిల్లర్స్” పలు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ చిత్రంలో రెడ్‌ సాండర్స్ చెట్లను ఎలా దారుణంగా నరికి, అక్రమంగా రవాణా చేసి, అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లకు ఎలా చేరవేసారనే అంశాలను స్పష్టమైన ఆధారాలతో చూపించారు.

ఈ మొత్తమైన మాఫియాను నడిపించిన అంతర్జాతీయ కింగ్‌పిన్‌లు, వందలాది టన్నుల విలువైన చెక్కను ఎత్తుకు వెళ్లేందుకు ఉపయోగించిన క్రూరమైన పద్ధతులు, అలాగే ఈ అక్రమ చర్యలను అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందిని చిత్రంలో భావోద్వేగంగా ప్రస్తావించారు.

రెడ్‌ సాండర్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్ వెనుక రాజకీయ ముసుగులు ధరించిన నేరగాళ్లు సమాజానికి అత్యంత ప్రమాదకరమని డాక్యుమెంటరీ స్పష్టం చేసింది. స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలు పెంచుకున్న కొంతమంది రాజకీయ నాయకులు, ఈ అక్రమ రవాణాను తమ రాజకీయ ఎదుగుదలకు ఇంధనంగా ఉపయోగించుకున్నారనే వాస్తవాలను చిత్రకారులు ధైర్యంగా బయట పెట్టారు.

శేషాచలం అడవుల నిర్దాక్షిణ్య నాశనం, అంతరించిపోతున్న రెడ్ సాండర్స్ చెట్లపై కొనసాగుతున్న దోపిడీని ప్రపంచం ముందుంచేందుకు చిత్ర బృందం తీసుకున్న ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.

ఈ డాక్యుమెంటరీ రూపొందించినవారి ధైర్యాన్ని మెచ్చుకుంటూ, శేషాచలం అడవులపై జరిగిన క్రూరమైన విధ్వంసాన్ని, విలువైన రెడ్‌ సాండర్స్ చెట్లపై జరుగుతున్న అంతర్జాతీయ మాఫియా దౌర్జన్యాన్ని నిజాలపై ఆధారపడి ప్రజల ముందుకు తీసుకువచ్చినందుకు వారికి విశేష ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి…. ఇదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు. ఇక ఎర్ర చందనం స్మగ్లర్లకు మూడినట్లే కనిపిస్తున్నది.

Related posts

హౌరా డాన్ అరెస్ట్: చెడ్డి పై ఊరేగించిన బెంగాల్ పోలీసులు

Satyam News

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం

Satyam News

ఎస్పీ బంగ్లాలో ‘ర్యాంకుల’ రచ్చ…

Satyam News

పశ్చిమ బెంగాల్ లో చీలిపోయిన మమతా బెనర్జీ పార్టీ

Satyam News

Leave a Comment