పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్ యువతను, ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. యువత పక్కదారులు పట్టవద్దు. తల్లిదండ్రులకు, దేశానికి గొప్ప పేరు తెచ్చేలా ఉండాలి.. ఈ దేశం మీది.. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు. నాచారంలోని డీపీఎస్ ( ఢిల్లీ పబ్లిక్ స్కూల్)లో “నశా ముక్త్ యువ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ వేదికల మీద మాది యువశక్తి ఉన్న దేశం అని గర్వంగా చెప్తారు. ఆ యువత జ్ఞావంతమైనదిగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రపంచ చిత్రపటంపై భారత్ అగ్రస్థానంలో ఉండాలనే కల సహకారం కావాలంటే విద్యార్థులు, యువత ఆరోగ్యవంతంగా ఉండాలి, కమిట్మెంట్ తో ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి.
ఎస్ఎస్సి ఎగ్జామ్ సందర్భంలో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సందర్భంలో విద్యార్థులు ఎంత టెన్షన్ గా ఉంటారో, ఆ పిల్లల టెన్షన్ తగ్గి విద్యార్థులు భయంలేకుండా పరీక్షలు రాయాలని.. ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ ముందు ఎలా ఉండాలి అనే విషయంపై మన ప్రధాని నరేంద్ర మోదీగారు మార్గదర్శనం చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రిగా నేను ఒక్కరిని ఏమి చేయలేను కానీ నేను ఒక మార్గదర్శకుడిగా విద్యార్థులు ఎలా ఉండాలి, యువత ఎలా ఉండాలి అనే దిశగా సూచనలు ఇస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ మహమ్మారి యువతను, విద్యార్థి శక్తిని, కుటుంబాలను ఎలా కుప్పకూలుస్తుందో మనం చూస్తున్నాం. ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ కు కేంద్రంగా ఉన్న పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు వ్యవసాయాభివృద్ధిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ నుండి స్మగ్లింగ్ అయిన డ్రగ్స్ వల్ల యువత ఎలా దెబ్బతింటుందో, ఆ రాష్ట్రం ఆర్థికంగా ఎలా వెనుకబడిందో మన కళ్లముందు కనిపిస్తున్న సత్యమని ఈటల రాజేందర్ అన్నారు.
ఒకప్పుడు భారత్ పేద దేశంగా, మేధావుల భాషలో చెప్పాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీగా పరిగణించబడేది. అమెరికా, రష్యా వంటి దేశాలు ఫస్ట్ వరల్డ్ కంట్రీలు, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ వంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడేవి. ఆ రోజుల్లో మన దేశంలో కార్పొరేట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థలు ఎక్కువగా లేవు. చాలా కుటుంబాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితులు ఉండేవి. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది.
ఇది విజ్ఞానశాస్త్రం, సాంకేతికత యుగం. ప్రపంచంలో ఎవరికీ తీసిపోని స్థాయికి భారత్ ఎదిగింది. ఆకలితో ఉన్న దేశం కాదు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థల వద్ద అప్పులు అడిగే పరిస్థితి కాదు. రైల్వేలు, ఎయిమ్స్, ఐఐటీలు, ఎయిర్ పోర్టులు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించుకునే స్థాయికి భారత్ ఎదిగింది.
మూడవ ఆర్ధిక శక్తిగా భారత్
ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనే సంకల్పంతో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ ఎదుగుదలలో యువత మేధస్సు, ఆలోచనలు, కృషి కార్యరూపం దాల్చే అవకాశాలు అపారంగా ఉన్నాయి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ, పేపర్ బాయ్ గా ప్రారంభించి భారతదేశ మిస్సైల్ మ్యాన్ గా ఎదిగిన ఆయన సంకల్పం, పట్టుదలతో ఎంతటి శిఖరాలను అధిరోహించవచ్చో చూపించారని అన్నారు.
చిన్న స్కూల్, పెద్ద స్కూల్ అనే తేడా కాదు, సంకల్పం ఉంటే ఎక్కడికైనా ఎదగవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈరోజు ప్రతి విద్యార్థి చేతిలో సెల్ ఫోన్, టాబ్లెట్, ఇంట్లో టీవీ ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందడం ఆనందదాయకమే కానీ దానికి నిర్మాణాత్మక వైపు ఉన్నట్లే విధ్వంసక వైపు కూడా ఉందని హెచ్చరించారు. సెల్ ఫోన్ ద్వారా ప్రపంచ జ్ఞానం తెలుసుకోవచ్చు, తల్లిదండ్రులతో సంప్రదించవచ్చు; అదే సెల్ ఫోన్ తప్పుగా వాడితే పతనానికి కారణమవుతుందని అన్నారు.
హంస నీటిని, పాలను వేరు చేసే శక్తి కలిగి ఉన్నట్లే, విద్యార్థులు కూడా మంచిని చెడును వేరు చేసుకునే వివేకం పెంపొందించుకోవాలని సూచించారు. చేతిలో ఉన్న సెల్ ఫోన్, టాబ్లెట్, ఇంట్లో ఉన్న టీవీని మంచి కోసం మాత్రమే ఉపయోగించాలని, మంచిని మాత్రమే ఆలోచించాలని, మంచిని మాత్రమే ఆచరించాలని, చదువును ఎప్పటికీ వదలకూడదని ప్రధానమంత్రి మోడీ సందేశాన్ని గుర్తుచేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మన ప్రవర్తన, పనితనం, ఎదుగుదల ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులకు ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
