ఉగ్రవాదుల స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్ కు ఎలాంటి మినహాయింపులు ఉండే అవకాశం లేదని భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి సాధారణ సభ 81వ సమావేశంలో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు.
వరుస ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే దేశం ఈ సభ ముందు వాస్తవాలను వక్రీకరించింది’ అని జై శంకర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఐరాసలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పాకిస్థాన్ లేదా షెహబాజ్ షరీఫ్ పేరును జైశంకర్ నేరుగా ప్రస్తావించలేదు.
ఉగ్రవాదాన్ని సాధారణ చర్యగా చూపించేందుకు, దాని పర్యవసానాల నుంచి రక్షణ పొందేందుకు పాకిస్తాన్ నేతలు కొన్ని వాదనలు వినిపించారని జైశంకర్ పేర్కొన్నారు. ‘‘అలాంటి ప్రయత్నాలు సాగవు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునే హక్కును భారత్ వినియోగించుకుంటుందని తెలిపారు. ‘‘స్నేహం, సద్భావనతో ఉగ్రవాదం సహజీవనం చేయలేవు’’ అని అన్నారు.
ఉగ్రవాదానికి పాల్పడేవారు తమ వైఖరిని మార్చుకోవాల్సిందేనని జైశంకర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో తీసుకునే నిర్ణయాలు, అవగాహనలు కూడా దాని ప్రభావానికి లోనవుతాయని స్పష్టం చేశారు. శాంతికి నిరంతరం ముప్పుగా మారుతున్న అంశాల్లో ఉగ్రవాదం ప్రధానమైనదని అన్నారు. ముఖ్యంగా సరిహద్దులు దాటి, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగితే అది అంతర్జాతీయ వ్యవస్థకు ప్రత్యక్ష సవాలుగా మారుతుందని పేర్కొన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితిని ప్రస్తుత పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తున్నాయని జైశంకర్ అన్నారు. ‘‘కొనసాగుతున్న శత్రుత్వాలపై మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం’’ అని తెలిపారు.
అంతర్జాతీయ జలమార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బందిపై దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జైశంకర్ స్పష్టం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, పౌరుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, ఇంధనం మరియు వాణిజ్య సరఫరాలు నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుతోందన్నారు.
సముద్ర మార్గాల్లో కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంతో పాటు ఎర్ర సముద్రం నుంచి నల్ల సముద్రం వరకు వాణిజ్య నౌకలు, వాటిలో పనిచేసే సిబ్బందిపై దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో భారతీయ నౌకా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని, ఇతర దేశాలకు చెందిన వారు కూడా మరణించారని చెప్పారు. ఇటువంటి ఘటనలు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పునరుద్ఘాటించారు.
అనవసరమైన లక్ష్యదాడులకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని సమీకరించే కార్యక్రమంలో లైబీరియాతో పాటు మరో 23 దేశాలతో భారత్ చేతులు కలిపిందని జైశంకర్ తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలపై కూడా జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అంతులేని యుద్ధాలకు ఇప్పుడు ముగింపు పలికి, ఘర్షణలకు ముగింపు దిశగా ప్రపంచం కదలాలి’’ అని ప్రపంచ దేశాల నేతలకు పిలుపునిచ్చారు. గల్ఫ్‌లో కొనసాగుతున్న పరిస్థితులతో పాటు ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి కూడా సమానంగా ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
