అమ్మవారి చల్లని దీవెనలతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆదివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.
ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఓం జెండాను ఆవిష్కరించారు. అమ్మవారి బోనాల జాతర సందర్భంగా ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు.
క్యూ లైన్ లోని భక్తులకు వాటర్ ప్యాకెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పుష్కలంగా వర్షాలు కురవాలని పంటలు పాడిపంట చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు చెప్పారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని పేర్కొన్నారు. తెల్లవారుజాము నుండే అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ ఉన్నప్పటికీ, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం లో మహంకాళి అమ్మవారి కి బంగారు బోనం సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లక్షలాది గా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా నెల రోజుల నుండి అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి భక్తులకు 100 సంవత్సరాల నుండి డెక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో సేవలు అందిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఏర్పాట్ల విషయంలో సహకరించిన, భక్తులకు సేవలు అందిస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు, డెక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ లకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, ఆర్య సమాజ్ అధ్యక్షుడు మాశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ సభ్యులు కొండాపురం మహేష్ యాదవ్, రాం మోహన్ యాదవ్, చంద్ర ప్రకాష్ శర్మ, డెక్కన్ మానవ సేవా సమితి సభ్యులు రఘు మోహన్, కమల్ కుమార్, అనురాగ్, నాయకులు సత్యనారాయణ, హన్మంతరావు తదితరులు ఉన్నారు.
మెమేంటోలను అందజేసిన తలసాని
మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వచ్చిన పలువురు ప్రముఖులకు మాజీమంత్రి, డెక్కన్ మానవ సేవా సమితి అధ్యక్షులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. డెక్కన్ మానవ సేవా సమితి ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల పేరుతో రూపొందించిన మెమేంటోలను ఆదివారం మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీమంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ మెమేంటోలను అందజేసి శాలువాతో సత్కరించారు.
