కృత్రిమ మేధస్సు (AI) వైద్య రంగంలో కీలక మార్పులకు దారితీస్తోందని నేషనల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, అధునాతన వైద్య పరీక్షలు, చికిత్స ప్రణాళిక, రోబోటిక్ సర్జరీ వంటి విభాగాల్లో AI వినియోగం వేగంగా పెరుగుతోందన్నారు.
బ్లెస్డ్ ఫుల్ డాక్టర్స్, బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యుడు డా. హరికుమార్ నాయకత్వంలో ఈ సదస్సు నిర్వహించారు. వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు, సాంకేతిక రంగ నిపుణులు పాల్గొని భవిష్యత్ వైద్య రంగంపై చర్చించారు.
AI అందరికీ అందుబాటులోకి రావాలి
నేషనల్ బీసీ దళ్ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త దుంద్ర కుమారస్వామి మాట్లాడుతూ AI ఆధారిత వైద్య సేవల ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక అభివృద్ధితో పాటు మానవ విలువలు, రోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మాజీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా IAS మాట్లాడుతూ వైద్య రంగంలో సాంకేతికత వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో AI కీలక పాత్ర పోషించనుందని అన్నారు. వైద్యులు, టెక్నాలజీ నిపుణులు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం ఉంటే ఆధునిక వైద్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించవచ్చన్నారు.
డా. హరికుమార్ మాట్లాడుతూ AI వైద్యులను భర్తీ చేసే సాధనం కాదని, వారి నైపుణ్యాన్ని మరింత బలోపేతం చేసే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుని, రోగుల ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీలను వినియోగించుకోవాలని సూచించారు.
సదస్సులో డా. కీర్తన యాదవ్, దుబాయ్‌కు చెందిన రెటీనా సర్జన్ డా. నిజాముద్దీన్, డా. సుభాన్, డా. నిధి, సుధా జైన్, సినీ నటి సనా తదితరులు పాల్గొన్నారు.
