ప్రపంచంహోమ్

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

#DonaldTrump

ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధంలో నేడు ఒక కీలక మలుపు చోటు చేసుకున్నది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఐదు నెలల యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

కొత్త దాడులను నిలిపివేస్తానని ట్రంప్ హామీ ఇస్తూ హోర్ముజ్ జలసంధి తెరవడానికి ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా ప్రపంచ ప్రయోజనాలను, అలాగే అభివృద్ధి చెందుతున్న ఇరాన్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమెరికా చేపట్టాల్సిన కొత్త సైనిక దాడులను తాత్కాలికంగా రద్దు చేయడానికి అంగీకరించానని ట్రంప్ వెల్లడించారు. అయితే వేగంగా ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆధారపడి ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

ట్రంప్ ప్రతిపాదనలపైనే అనుమానాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ పలుమార్లు కాల్పుల విరమణకు ప్రయత్నించినప్పటికీ, ప్రతి సారి పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారి ఘర్షణలు పునఃప్రారంభమయ్యాయి.

ట్రంప్ ప్రకటనపై స్పందించిన ఇరాన్ రక్షణ మంత్రి, అమెరికా వైఖరిపై తమకు ఎలాంటి ఆశ్చర్యం లేదని, ఇరాన్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉందని తెలిపారు. అమెరికా నుంచి వాస్తవ ముప్పు కొనసాగుతున్న నేపథ్యంలో దేశ భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం ఉండదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

మధ్యవర్తిత్వ ప్రక్రియలో పాల్గొంటున్న ఒక ప్రాంతీయ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, తాజా ప్రతిపాదనలో అమెరికా-ఇరాన్ మళ్లీ చర్చల బల్లపైకి రావడం, గతంలో నిలిచిపోయిన కీలక అంశాలపై చర్చలు కొనసాగించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. అలాగే హోర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్ మిలీషియాలు గల్ఫ్ దేశాలు, జోర్డాన్‌పై దాడులను నిలిపివేయడం వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇరాన్ చమురు ఎగుమతులకు అనుమతినిస్తారా?

దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్‌పై అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు, ఇరాన్ మళ్లీ తన చమురు ఎగుమతులను ప్రారంభించేందుకు అనుమతించే అంశం కూడా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనలో ఉందని ఆ అధికారి తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని, మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మాత్రమే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా మరిన్ని దాడులు చేపడితే ఇరాన్ ప్రతీకార చర్యలుగా సౌదీతో పాటు ఇతర గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత కోరినట్లు సమాచారం. అయితే ఈ ఫోన్ సంభాషణ వివరాలను వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించలేదు.

హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో తమ అనుమతి లేకుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ గతంలో పలుమార్లు చర్యలు తీసుకున్న నేపథ్యంలో, ఈ మార్గాన్ని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం ప్రపంచ చమురు సరఫరాలకు కీలకంగా భావిస్తున్నారు.

మరింత ఉద్రిక్తంగా మారుతున్న గాజా

మరోవైపు గాజా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం ఎనిమిది మంది పాలస్తీనీయులు మరణించగా, మరో డజనుకు పైగా గాయపడ్డారు. దక్షిణ గాజాలోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో నాలుగేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గాజా నగరంలోని మరో నివాస ప్రాంతంపై జరిగిన దాడిలో మరో కుటుంబానికి చెందిన ముగ్గురు, అందులో ఒక చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబంలోని మహిళ ఆరు నెలల గర్భిణి అని వైద్య అధికారులు తెలిపారు. మధ్య గాజాలో మరో దాడిలో భార్యాభర్తలు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

ఈ దాడులు హమాస్‌కు చెందిన సైనిక కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని జరిగాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించినప్పటికీ, పూర్తి వివరాలను వెల్లడించలేదు.

అక్టోబర్‌లో అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత ఇప్పటివరకు కనీసం 1,222 మంది పాలస్తీనీయులు, అందులో 260 మంది చిన్నారులు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే కాలంలో ఐదుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి.

ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ బహ్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న అమెరికా పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. విమాన సర్వీసుల రద్దు, గగనతల మూసివేత, ప్రయాణ అంతరాయాలు ఏర్పడే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related posts

దుబాయ్ ఎయిర్ పోర్టు పై మళ్ళీ దాడి

Satyam News

మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

Satyam News

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

Satyam News

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పని సరి

Satyam News

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

Satyam News

శ్రీశైలంలో ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Satyam News

Leave a Comment