ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ అంశంపై రాజేంద్రనగర్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు పాల్గొన్నారు.
వర్క్‌షాప్‌లో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గతంలోనూ దేశం పలుమార్లు ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొందని తెలిపారు. 1951 నుంచి ఇప్పటివరకు భారత్ 12 సార్లు ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, ముందుగానే అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా రైతులు, పశుసంపద, మత్స్య రంగాన్ని కాపాడుకోవచ్చని అన్నారు.
కరువును ఎలా ఎదుర్కోవాలనే విషయంలో రైతులకు అనుభవం, అవగాహన ఉన్నప్పటికీ, ఆ అవగాహనను ఆచరణలోకి తీసుకెళ్లేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని మంత్రి తెలిపారు. పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావచ్చని, ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలి, ఎలాంటి పద్ధతులు అవలంబించాలనే విషయంపై రైతులకు అధికారులు, వ్యవసాయ నిపుణులు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆస్ట్రేలియా వంటి దేశాలు ఎల్‌నినో ప్రభావాన్ని ముందస్తు ప్రణాళికలతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలోనూ ముందస్తు కార్యాచరణ రూపొందించి కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినోపై దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ముందస్తు కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు.
ఎలాంటి కరువు పరిస్థితులు ఎదురైనా రైతు ధైర్యంగా వ్యవసాయం కొనసాగిస్తాడని, పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో రాకపోయినా వ్యవసాయాన్ని మాత్రం వదులుకోడని మంత్రి అన్నారు. అలాంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులను కరువు పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను కోరారు.
కరువు సమయంలో పశుసంపదను కాపాడేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పశువుల పెంపకం, సంరక్షణపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించాలని అన్నారు. మేకలు, గొర్రెలు మేతకు వెళ్లేందుకు ప్రత్యేక ప్రాంతాలను గుర్తించి కేటాయిస్తే పశుసంపదను మరింత అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు.
మత్స్య రంగంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని వాకిటి శ్రీహరి సూచించారు. చేపల పెంపకానికి నీరు అత్యవసరమని, చెరువుల్లో చేపల పెంపకం కొనసాగాలంటే అవసరమైన నీటి సరఫరాకు ముందస్తు ప్రణాళిక ఉండాలని అన్నారు. చెరువుల నీటిని రైతులు వినియోగించే పరిస్థితుల్లో సమన్వయం చేసుకుని మత్స్యకారులకు అవసరమైన నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాల ద్వారా లభించే నీటిని వృథా కాకుండా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ద్వారా నిల్వ చేసి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. నీటి సంరక్షణ చర్యలను గ్రామస్థాయిలోనే బలోపేతం చేయాలని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన సందర్భంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తే తెలంగాణను దేశానికి ఒక మోడల్‌గా నిలపవచ్చని వాకిటి శ్రీహరి అన్నారు. ఎల్‌నినో వంటి ప్రకృతి పరిణామాలను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో రైతులకు భరోసా కల్పించి, వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య రంగాలను కాపాడుతూ ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
