రంగారెడ్డిహోమ్

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టం భావితరాలకు స్ఫూర్తి

#Bhiranpalli

వీరబైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కమిటీ సభ్యులు కప్పర ప్రసాద్, బీజేపీ అధికార ప్రతినిధి కేవీఎల్ఎన్ రెడ్డి, సురేష్, కార్యక్రమ కన్వీనర్ శ్రీనివాస్, కో-కన్వీనర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 27న రజాకారుల దాడిలో వీరబైరాన్‌పల్లిలో 118 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. నిజాం, రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. రజాకారుల దమనకాండకు వ్యతిరేకంగా రెండు దఫాలుగా దాడులను ఎదుర్కొని వీరబైరాన్‌పల్లి ప్రజలు, అమరవీరులు చూపిన ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలన కొనసాగిందని తెలిపారు. తెలంగాణ ప్రజలపై సాగిన దమనకాండకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వీరబైరాన్‌పల్లి ఘట్టం విషాదకరమైనదైనా, ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందన్నారు.

వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టంతో పాటు తెలంగాణ విమోచన పోరాటంలోని చారిత్రక సంఘటనలను నేటి, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ యాక్షన్ అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారం కోసం చరిత్రను విస్మరించారు

తెలంగాణలో అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ విమోచన పోరాట చరిత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి విమర్శించారు.

ఎంఐఎంకు భయపడి, ఓట్ల కోసం అప్పీజ్మెంట్ రాజకీయాలు చేస్తూ తెలంగాణ ప్రజల గొప్ప పోరాట చరిత్రను మరుగునపరిచారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, అమరవీరుల చరిత్రను విస్మరించడం బాధాకరమన్నారు.

సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలి

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం, చరిత్ర గురించి మాట్లాడిన గత పాలకులు అధికారంలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ విమోచన చరిత్రకు తగిన గౌరవం కల్పిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో సెప్టెంబర్ 17ను అధికారికంగా ఘనంగా నిర్వహించాలని కోరారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అమరవీరుల త్యాగాలు, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

చరిత్రను వాస్తవాలతో ప్రజలకు తెలియజేయాలి

మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను వాస్తవాలతో ప్రజలకు తెలియజేయడం కోసం బీజేపీ అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తోందన్నారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

కప్పర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను వాస్తవాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రాజకీయ పార్టీల పాత్రను కూడా చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి వారిని సన్మానించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. వీరబైరాన్‌పల్లి పోరాట ఘటనలను చిన్నతనంలో ప్రత్యక్షంగా చూసిన పెద్దలతో మాట్లాడి నాటి పరిస్థితులను తెలుసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని నాయకులు కోరారు.

కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, నాటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన పెద్దలు, బీజేపీ గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి పుష్పయాగం

Satyam News

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

Satyam News

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

Satyam News

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

Satyam News

పోలవరం లో డీ వాటరింగ్ ప్రారంభం

Satyam News

Leave a Comment